మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాజీనామాల రాజకీయం ప్రారంభించింది. అందరూ రాజీనామా చేసి మూడు రాజధానుల ఎజెండాగా పోటీ చేసి 175కి 175 స్థానాలు గెల్చుకున్నా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. దానికి చట్టం, రాజ్యాంగాలు ఒప్పుకోవు. ఈ విషయం కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న వారందరికీ తెలుసు. అమరావతి విషయంలో రాష్ట్రానికి శాసనాధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు శిలాశాసనం లాంటిది. సుప్రీంకోర్టులో కొట్టి వేయించుకుంటే తప్ప.. మరో మార్గం లేదు.
ఏపీ హైకోర్టు.. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉందని చెప్పింది. అదే సమయంలో భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చింది. ఈ తీర్పు వల్ల సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం ద్వారాలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టడం ద్వారానో సాధ్యం కాదు. ముఖ్యమంత్రి విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడం ద్వారా రాజధాని తరలి పోదు. కానీ హైకోర్టు తీర్పు ఇచ్చినా అమరావతి విషయంలో ప్రభుత్వం ముందు ఒకే ఒక్క మార్గం ఉంది. అదే చట్టం ప్రకారం రైతులకు రూ. లక్ష కోట్ల వరకూ నష్టపరిహారం చెల్లించడం.
సీఆర్డీఏ ఒప్పందంలోని 18వ షరతు ప్రకారం అమరావతిలో పనులు నిలుపుదల చేయాలని అటు ప్రభుత్వం కానీ ఇటు రైతులు కానీ కోరినా నష్టపరిహారం కోరుకోవచ్చు. ఈ చట్టంలో నిబంధనల ప్రకారం అది కనీసం లక్ష కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రాజీనామాలు చేసినా..గెలిచినా.. మళ్లీ ప్రభుత్వం వచ్చినా మూడు రాజధానులు చేయలేరు. తాము గెలిస్తే మూడు రాజధానులు తెస్తామని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమే. అయినా రాజకీయ పార్టీలు ఇలా మోసం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.