మాజీ మంత్రి శంకర్ నారాయణపై ఓ మహిళ తిరగబడిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపం కట్టలు తెగితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో.. ప్రజల్లో అసహనం పెరిగిపోతే తట్టు కోవడం సాధ్యం కాదని నిరూపించేలా ఆ ఘటన ఉంది. నిజానికి ఇలాంటివి దాదాపుగా ప్రతి ప్రజాప్రతినిధికి అవగతమవుతున్నాయి. ఎందుకీ పరిస్థితి వచ్చింది ? అంటే తెలుసుకోలేకపోవడం .. తెలియకపోవడం సమస్య కాదు. పేదవాళ్లు ఏమీ చేయలేర పించన్ పీకేస్తే … పథకాలు తీసేస్తే కాళ్ల దగ్గరకు వస్తారు కానీ ఏమీ చేయలేరని భావించడమే కారణం.
ఇప్పటి వరకూ ఏపీలో పరిపాలన చేసిన ప్రభుత్వాలు పేదలకు కులాలు, మతాలు, పార్టీలు అంటగట్టేందుకు సాహసించలేదు. వారికి పథకాల లబ్ది విషయంలో ఎక్కడా మాట పడలేదు. నిజమైన అనర్హులు ఉంటే మాత్రం తీసేవారు . కానీ వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. మన పార్టీ వాళ్లు.. మనకు సపోర్ట్ చేసే కులం అయితేనే ప్రధాన అర్హతగా భావించి లబ్దిదారులుగా మార్చారు. ఫలితంగా అసలైన అర్హులు ఎంతో మంది పథకాలు అందుకోలేకపోతున్నారు. పేదలకు కులం, మతం, పార్టీ అంటగట్టి వారిని ఘోరంగా ప్రభుత్వం అవమానించింది.
అంతేనా వాలంటీర్లు.. స్థానిక వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోయారు. తమకు వ్యతిరేకం అనుకున్న వారందరికీ ఎలాంటి ప్రయోజనం కల్పించకుండా చూశారు. సొంత పార్టీ వారిలో ప్రత్యర్థులు ఉంటే ఎవరి బలం మేరకు వారు ఆ పని చేశారు. మెజార్టీ లబ్దిదారులు ఈ వ్యవహారంపై అసంతృప్తితో రగిలిపోయే పరిస్థితికి వచ్చింది. గడప గడపకూ వెళ్తున్న వైసీపీ నేతలకు.. ఈ విషయం అవగతమవుతోంది. చాలా చోట్ల తప్పుడు సమారం ఇచ్చి అభాసు పాలవుతున్నారు.
పాలనలో రాజకీయం చొప్పిస్తే అరాజకీయం ఏర్పడుతుంది. అది సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడితే పరిస్థితులు ఎంత దారుణగా మారిపోతాయో పెనుకొండ ఘటనే ఉదాహరణ. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికిప్పుడు మార్పులు చేసుకోకపోతే భవిష్యత్లో చేసుకోవడానికి కూడా చాన్స్ రాకపోవచ్చనేది ఎక్కువ మంది అభిప్రాయం.