గుంటూరులో జనసేన కార్యకర్తలను… అదీ మహిళా కార్యకర్తలు అని కూడా చూడకుండా.. వైసీపీ కార్యకర్తలు రాళ్లతో కొట్టారు. ఉనికి ఉందో లేదో అనుకున్న కాంగ్రెస్ యాత్రపై నెల్లూరు జిల్లాలో రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. కేవలం ఉద్రిక్తత సృష్టించడానికే.. ఒంగోలులో ఓ కాలనీలో.. పార్టీ ఆఫీసు పెట్టాలని ప్రయత్నించి.. దాని కేంద్రంగా ఉద్రిక్తత రెచ్చగొట్టారు. ఆరు గంటల పాటు ఒంగోలు వణించారు. ఈ మూడు వ్యవహారాల్లోనూ వైసీపీదే ప్రధాన పాత్ర. మిగతా మూడు చోట్ల..మూడు వేర్వేరు పార్టీలు బాధితులు. ఇక ఎన్నికల మొత్తానికి ఇదే వైసీపీ వ్యూహం..!
రాజకీయ దాడులకు వైసీపీ నేతలు ప్లాన్ చేశారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయక ముందే క్షేత్ర స్థాయిలో… క్యాడర్ ఘర్షణలకు దిగడానికి సమాయత్తమవుతోంది. ఎన్నికలకు ముందే .. మానసికంగా పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో.. పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకత్వం వీటిని ప్రొత్సహిస్తోంది. ఫలితంగా ఏపీలో.. ఓ రకమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది. గుంటూరులో మహిళపై దాడి చేసినా.. . నెల్లూరులో కాంగ్రెస్ బస్సుయాత్రను టార్గెట్ చేసినా.. నెల్లూరులో… ఓ కాలనీ వాసులపై దండయాత్ర చేసినా… అన్ని చోట్లా వైసీపీ కార్యకర్తలే కనిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ నేతల విషయంలో ప్రజల్లో ఓ రకమైన ఆందోళన ఉంది. దానికి తగ్గట్లుగానే.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు.. వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల ప్రకటన కూడా రాక ముందే.. దాడుల్లాంటి వ్యవహారాలకు తెగబడుతూండటంతో… పరిస్థితి సీరియస్గా మారుతోంది.
ఏపీలో రాజకీయ అలజడి రేపడానికి అంతా రెడీ అయిందా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల వ్యూహాలు.. ఎప్పుడూ.. కాస్తంత వయోలెంట్గానే ఉంటాయనేది.. ఏపీ రాజకీయాలను పరిశీలిస్తున్న వారు ఏకగ్రీవంగా అంగీకరించే మాట. ప్రతిపక్ష పార్టీ నేత మాటలు, చేతలు దానికి కారణం కావొచ్చేమో కానీ… ఆయన క్యాడర్ కూడా.. అలా చేయడమే.. తమ పార్టీ సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. మూడు రోజుల్లోనే.. వరుసగా జరిగిన ఘటనలు యాధృచ్చికం కాదన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఓ ప్లాన్ ప్రకారమే.. ఇప్పటికే.. సామాజికవర్గ అలజడి రేపే ప్రయ.త్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇప్పుడు ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి. గతంలో..కొన్ని విధ్వంసకర ఘటనల వెనుక ఇలాంటి ప్లానే ఉందని.. పోలీసులు గుర్తించారు కూడా. పరిస్థితుల్ని బట్టి చూసినా… నెల్లూరులో అయినా.. గుంటూరులో అయినా.. ఒంగోలులో అయినా.. ఉద్రిక్తతలు తలెత్తి.. దాడులకు తెగబబడాల్సిన పరిస్థి అయితే లేదనేది.. పోలీసులు చెప్పే మాట.
వైసీపీ ఇమేజ్ను మార్చుకునే ప్రయత్నం చేయదా..?
కనీసం ఎన్నికల ప్రకటన కూడా రాక ముందే.. రాజకీయంగా ఇలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూంటే.. ముందు ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన మాత్రం సామాన్య ప్రజల్లో ఏర్పడుతోంది. ఎందుకంటే.. ఈ సారి రాజకీయ పార్టీలన్నీ… తమ తమ ఎన్నికల పోరాటాన్ని చావో రేవో అన్నట్లుగా తీసుకున్నాయి. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ఎక్కువ పట్టుదల చూపిస్తోందని…వరుస దాడుల ఘటనలతో తేలిపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఓ రకమైన ఇమేజ్ ఉంది. ఆ పార్టీ వస్తే.. మళ్లీ పులివెందుల ముఠాలు చెలరేగిపోతాయన్న భయం ప్రజల్లో ఉంది. దీన్ని రాజకీయం చేయడానికి ఇతర పార్టీలు ప్రయత్నిస్తాయి. చంద్రబాబు ఇప్పటికే వైసీపీ వస్తే.. వీధికో గూండా తయారవుతారని హెచ్చరిస్తున్నారు. మరి వైసీపీ.. తన వయోలెంట్ ప్లాన్ అమలు చేస్తుందా..?. భయపెట్టడమే తమకు కలసి వస్తుందని.. అనుకుంటుందో చూడాలి.. !