మీకు ఇంటి పట్టా కావాలా ? ఓటు ఉంటే చాలు..ఏపీలో ఇంటి పట్టా ఇచ్చేస్తారు., జగన్ రెడ్డి బొమ్మతో చెల్లని రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. కానీ ఇస్తామన్న ఆ సెంట్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇచ్చే పట్టాల్లో ఆ డిటైల్స్ కూడా ఉండవు. ముందు ఓటు వేయండి.. తర్వాత స్థలం చూపిస్తామంటారు. అబ్బో.. ఆ మాత్రం తెలివి తేటలు మాకు లేవా అని జనం వాళ్ల వైపు వింతగా చూడాల్సిన పరిస్థితి. ఒక్క ఇళ్ల పట్టాలే కాదు.. ప్రతీ ఇంటికి ఇప్పుడు పనికి రాని.. పని చేయని ప్రభుత్వ కార్డులు పంచుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతీ ఇంటికి ఇస్తున్నారు. అది ఉంటే ఇరవై లక్షల రూపాయల వైద్యం ఫ్రీ అంటున్నారు. అది తీసుకుని ఏ ఆస్పత్రికైనా వెళ్తే ఎగాదిగా చూసి అక్కడి సిబ్బంది నవ్వతున్నారు.
జగన్ రెడ్డి సర్కార్ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న వైనం పీక్స్ కు చేరింది. పదవి చేపట్టిన ఏడాదిన్నరకే.. పులుసు అంతా అయిపోవడంతో.. మోసం చేయడమే పనిగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆరోగ్య శ్రీలో దేనికైనా చికిత్స ఫ్రీ అంటూ చాలా కబుర్లు చెబుతారు.. అసలు వైద్యమే అందని పరిస్థితి. ఇళ్ల పట్టాలు 31 లక్షలు ఇచ్చామని చెబుతారు. కానీ సెంటు స్థలాల పేరుతో వేల కోట్లు అవినీతి చేసి.. ఎక్కడో ఊరికి దూరంగా … . ఇచ్చారు. అక్కడెవరూ ఇళ్లు కట్టుకోవడం లేదు. ప్రభుత్వం కట్టివ్డవం లేదు. ఇలా పాతిక లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు.
వచ్చే రెండు నెలల పాటు మరింత ఎక్కువగా ప్రభుత్వం పనికి రాని పథకాల కార్డులను పంపిణీ చేయడానికి రెడీ అయిపోయింది. అందుకోసం ఉద్యోగులు సెలవులు పెట్టవదద్దని చెబుతోంది. ఇప్పటికే ప్రజలు పూర్తిగా ప్రభుత్వ అబద్దాలు వినీ వినీ అలసిపోయారు. ప్రతీ సారి ఎలా మోసపోతామని వారంటున్నారు. 40 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి పంపిణీ చేయలేదు.. ఇప్పుడు రైతులకూ ఓ కార్డు పంపిణీ చేస్తామని.. రుణమాఫీ చేస్తామని.. కథలు చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
ఓట్ల కోసం.. జగన్ రెడ్డి ఇప్పటికే చేయాల్సినంత మోసం చేశారు. రేషన్ బియ్యాన్ని కూడా అంద కుండా చేశారు. ఇప్పుడు మళ్లీ తాను వస్తే.. ఉన్న గోచిని గ్యారంటీగా ఊడబీకనని.. హామీ ఇస్తూ.. వచ్చేస్తున్నారు. ప్రభుత్వం అంటే నమ్మకం లేకుండా చేసిన పాలన చేసి… చరిత్రలో నిలిచిపోతున్నారు.