కర్ణాటక ఎన్నికల్లో భాజపాకి వ్యతిరేకంగా ఓటెయ్యాలంటూ ఏపీ అధికార పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాకి అన్ని విధాలుగా అన్యాయం చేసిన భాజపాకి మద్దతు పలకొద్దంటూ అక్కడి తెలుగు ప్రజలకు టీడీపీ పిలుపునిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ మధ్య కర్ణాటక వెళ్లి, జేడీఎస్ కు మద్దతు ప్రకటించారు. కానీ, కర్ణాటక ఎన్నికల్లో వైకాపా వైఖరి ఏంటనేది ఇంతవరకూ స్పష్టతలేని విషయంగా ఉంది. ఎలాగూ వారూ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు కదా! ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమిస్తున్నారు కదా. అలాంటప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటెయ్యద్దు అని ప్రచారం చేయొచ్చు. కానీ, ఆ పని చేయడం లేదు! అది చాలదన్నట్టు… భాజపాకి అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతలు కొంతమంది వైకాపా నేతలే నెత్తినేసుకుని, వార్డుల్లో తిరుగుతూ ఉండటం విశేషం!
రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, జగన్ కి సన్నిహితుడు కాపు రామచంద్రారెడ్డి కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారట. మొళకాల్లూరులో భాజపాకి ఓటెయ్యాలంటూ తిరుగుతున్నారు. ఇక్కడ బి. శ్రీరాములు పోటీలో ఉన్నారు. ఇక, సోమశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్న బళ్లారి నియోజక వర్గ పరధిలో కూడా రామచంద్రారెడ్డి ప్రచారం చేస్తున్నారట! ఆయన ఒక్కరే తిరిగితే ఒకెత్తు.. రాయదుర్గం నుంచి తన అనుచరుల్ని తీసుకొచ్చి మరీ భాజపా ఓటెయ్యాలంటూ ప్రచారం చేయించడం గమనించదగ్గ విషయం. అంతేకాదు, కర్నూలు జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా అక్కడ భాజపాకి మద్దతుగా ప్రచారానికి సహాయ సహకారాలు అందిస్తున్నారట! వైకాపా అధినేత జగన్ కీ, గాలి జనార్థన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాజపా, జగన్ ల మధ్య ఓ దశలో ఈయనే రాయబారం నెరపారనే అభిప్రాయమూ ఉండేది. గాలి కుటుంబానికి చెందిన దాదాపు పదిమంది ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారి గెలుపు బాధ్యతల్ని గాలి భుజానికి ఎత్తుకున్నారు. కాబట్టి, ఇలాంటి సమయంలో సన్నిహితుడికి సాయం చేయాలి కదా!
వైకాపా, భాజపాల మధ్య తెరచాటు సాన్నిహిత్యం ఏ స్థాయికి చేరిందో అవిశ్వాస తీర్మానం సందర్భంగా అందరికీ తెలిసింది. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా పార్లమెంటులో తీర్మానం అంటూ, మరోపక్క ప్రధాని కార్యాలయంతో ముచ్చట్లు పెట్టుకున్న వైకాపా నేతల తీరు తెలిసిందే. కేంద్రంపై పోరాటం అంటూ మోడీపైగానీ, భాజపాపైగానీ నేటికీ ఘాటుగా ధీటుగా విమర్శ చేయని జగన్ తీరూ చూస్తున్నాం. 2019 ఎన్నికల ముందు బహిరంగంగా పొత్తు ప్రకటించేంత ధైర్యం రెండు పార్టీలకీ లేకపోయినా, ఆ తరువాత వీరు కలుస్తారనే ఓ స్థాయి నమ్మకం చాలామందిలో ఉంది. కాబట్టి, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో భాజపాకి అనుకూలంగా వైకాపాకి చెందినవారు ప్రచారంలో దిగడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు!