ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ చూర్పులూ మార్పులూ కూడికలూ తీసివేతల చుట్టూనే తిరుగుతున్నాయి. మనం బలపడాలంటే ఎదుటివారిని బలహీన పరచాలన్న ఒక మూల సూత్రం ఆధారంగానే ఆపరేషన్ ఆకర్షణలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, వారి ఆకర్షణ దృష్టంతా విపక్ష ఎమ్మెల్యేలపై ఉంది. వైకాపా అధికారంలో లేదు కాబట్టి, వీరి ఆకర్షణ దృష్టి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలపైనా, అసంత్రుప్త నేతలపైనా ఉంది. ఈ ఫిరాయింపు రాజకీయాల్లో వైకాపాకు ఒక నెలరోజుల వ్యవధిలోనే రెండు అనుభవాలు ఎదురయ్యాయి. మరి, వీటి నుంచి ఏదైనా తెలుసుకుందా.? కనీసం, ఈ పరిణామాలపై పార్టీలో విశ్లేషణ అయినా జరుగుతోందా..? ఈ రెండు పరిణామాలనూ రెండు వేర్వేరు అంశాలుగానే పార్టీ చూస్తోందా..?
తాజా పరిణామం ఏంటంటే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనాథరెడ్డిని వైకాపాలోకి ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఒక కీలక టీడీపీ నేతలకు వైకాపాలోకి తీసుకొస్తే, బాగా దెబ్బ కొట్టినట్టు అవుతుందని భావించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. ఇదే అదనుగా పీలేరులో పట్టు సాధించి, రాజంపేట లోక్ సభ స్థానాన్ని నిలుపుకోవడం కోసం వైకాపా వ్యూహం రచించింది. శ్రీనాథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎరజూపారు, కాంట్రాక్టుల్లో సాయం చేస్తామనీ ఊరించారు. వైకాపా ముఖ్యనేతలు చింత రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి ఆయనతో మంతనాలు సాగించారు. చివర్లో కథ అడ్డం తిరిగేసింది! శ్రీనాథరెడ్డి మీడియా ముందుకు వచ్చేసి.. టీడీపీ పట్ల తనకున్న నిబద్ధత, విశ్వాసాన్ని ప్రకటించడంతో వైకాపా ఆకర్ష్ కాస్తా వికర్షించింది. దీంతో వైకాపా నేతలు డైలమాలో పడ్డారు. టీడీపీలోని అసంతృప్త నేతల్ని ఆకర్షించడం ఈజీ అనుకుంటే… పరిస్థితి ఇలా ఉల్టా అయింది.
ఈ మధ్యనే పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో ఆమె కాస్త అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు చాన్నాళ్లుగా వస్తున్నాయి. ఈ అవకాశాన్ని టీడీపీ అందిపుచ్చుకుంది. తెర వెనక ఏం జరిగిందో తెలీదుగానీ… గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి వచ్చేశారు. వైకాపా నేతలు చేసిన బుజ్జంగిపులు వర్కౌట్ కాలేదు.
ఈ రెండింటినీ వరుసగా విశ్లేషించుకుంటే.. టీడీపీ నేతను ఆకర్షించడంలో వైకాపా ఫెయిల్ అయింది. సొంత పార్టీ నాయకురాలిని బయటకి వెళ్లనీయకుండా కట్టడి చేసుకోవడంలోనూ వైకాపా వైఫల్యం కనిపిస్తూనే ఉంది. ఈ రెండు సందర్భాల్లోనూ వైకాపా నేతల విశ్లేషణ ఏంటంటే.. ‘టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ సౌలభ్యాన్ని వారు వాడుకుంటున్నారు’ అని. వాస్తవం ఇదే కావొచ్చు. కానీ, ఈ అభిప్రాయంలో వైకాపా కోణం ఏదీ..? వైకాపా ప్రయత్నం ఏదీ..? గిడ్డి ఈశ్వరిని పార్టీలో నిలబెట్టుకునే ప్రయత్నం, శ్రీనాథరెడ్డిని పార్టీలోకి తెచ్చుకునే వ్యూహం.. వీటిలో ఉన్న లోపాలపై వైకాపాలో చర్చ జరుగుతున్న దాఖలాలే లేవు. ఎవరైనా నాయకులు పార్టీ నుంచి పోతుంటే.. పోతే పోనీ, ఉన్నవాళ్లే ఉంటారంటారు! ఎవరైనా నాయకులు పార్టీలోకి రాకపోతే.. పోతేపోనీ, వచ్చేవాళ్లే వస్తారంటారేమో! ఇలాంటి సందర్భాల్లో పార్టీలో సమగ్రమైన చర్చ జరగకపోవడం వల్ల ఉన్న నాయకులకు ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయనేది వైకాపా ఆలోచించుకోవాలి. ఉన్నవారికి నమ్మకం కుదిరితేనే… కొత్తవారికి రావొచ్చూ అనే భరోసా కనిపిస్తుంది. మరి, ఈ సూక్ష్మం వ్యూహకర్తలకు అర్థమౌతోందో లేదో..!