ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీకి దూరమౌతున్నారు. నాయకులు వలస బాట పడుతున్నారు. నాయకులతోపాటు కేడర్ కూడా చేజారుతోంది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీని వీడటంతో ఆ సంఖ్య 23కి చేరిపోయింది. త్వరలోనే అనంతపురం నుంచి కూడా వలసలు ఉంటాయంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వైకాపా నేత కూడా జంప్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యం వైకాపాలో జరుగుతున్నది ఏంటి..? పార్టీ నుంచి వెళ్లాలనుకుంటున్న నేతలకు అధినేత ఫోన్ చేసినా బుజ్జగింపులు ఎందుకు ఫలించడం లేదు..? ఫిరాయింపునకు సిద్ధమైన నేతల్ని ఎందుకు ఆపలేకపోతున్నారు..? ఈ ఫిరాయింపుల్ని తెలుగుదేశం పార్టీ చాణక్యంగా చూడాలా..? లేదంటే, వైకాపా వైఫల్యంగా చూడాలా..? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
నిజానికి, ఫిరాయింపుల విషయంలో మొదట్నుంచీ వైకాపా కాస్త మొండి వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఎవరైనా నాయకులు పార్టీ మారతారు అనగానే, ఆ పరిస్థితిని ప్రాథమిక స్థాయిలో వైకాపా అధినాయకత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు. టీడీపీ నుంచి హామీలు, మంతనాలు అన్నీ పూర్తయ్యాక… తీరిగ్గా ఆ సందర్భంలో పార్టీ నుంచి బుజ్జగింపు చర్యలు మొదలౌతాయి. విజయసాయి రెడ్డి మాట్లాడారనీ, జగన్ ఫోన్ చేశారనీ చెబుతారు. కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోయి ఉంటుంది! ఆ తరువాత, సొంత పత్రికలో సదరు నేతలకు వ్యతిరేకంగా కథనాలు వేస్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టారంటూ వైకాపా నేతలు కొన్నాళ్లు విమర్శిస్తారు. అక్కడితో ఆ ఛాప్టర్ ముగుస్తుంది. ఫిరాయింపులను నిరోధించే విషయంలో పార్టీది మొదట్నుంచీ ఇదే ధోరణి. ‘పార్టీ నుంచి బయటకి వెళ్లాలి’ అని నిర్ణయించుకున్న ఏ ఒక్క ఎమ్మెల్యేనీ వైకాపా ఆపలేకపోయింది. సదరు నాయకుల్లో భరోసా నింపలేకపోయింది.
ఇక, ఫిరాయింపుల పట్ల అధినేత జగన్ వ్యవహార శైలి కూడా కాస్త దూకుడుగానే ఉంటుందని అంటారు. ‘ఉన్నవాళ్లు ఉంటారు, పోయినవార్ని పోనివ్వండి, వారు పోయినంత మాత్రాన ఎవ్వరికీ నష్టం లేదు’ అనే ధోరణిలో జగన్ ఉంటారు. పార్టీలోకి కొత్తవారి రాక అవసరమే. కానీ, దీని కోసం ఉన్నవారిని దూరం చేసుకుంటున్నారనే భావన సీనియర్ల నుంచి వ్యక్తమౌతోంది. ఫిరాయింపుల విషయంలో జగన్ అనురిస్తున్న ఈ ధోరణి పార్టీకి ఎంతవరకూ మేలు చేస్తుందనేది వేచి చూడాల్సిన అంశమే. ప్రతీదానికీ ఎన్నికలే సమాధానం అన్నట్టుగా జగన్ మాట్లాడుతుంటారు. కరెక్టే కావొచ్చు, కానీ ఈలోగా ఫిరాయింపులను నిరోధించడంలో వైకాపా వైఫల్యం చెందుతోందనీ, అధినాయకత్వం పార్టీపై పట్టు కోల్పోయినట్టుందనీ, పార్టీకి ఎంత చేసినా నేతలకు జగన్ గుర్తింపు ఇవ్వరనే సంకేతాలు కేడర్ లోకి వెళ్తాయి కదా! ఫిరాయింపుల విషయమై టీడీపీతో పోరాటాలు సాగిస్తూనే… అంతర్గతంగా పార్టీలో కూడా కొంత భరోసా కల్పించేలా ఈ వ్యవహారాన్ని జగన్ డీల్ చేయడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.