మత అసహనం అనే విషప్రచారంతో ప్రపంచ దేశాల దృష్టిలో దేశ ప్రతిష్టకు కాంగ్రెస్ పార్టీ భంగం కలిగిస్తుంటే, కాల్ మనీ, సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, ఇసుక మాఫియా వంటి నేరాలకు విజయవాడ రాజధానిగా మారిందని దుష్ప్రచారం చేస్తూ వైకాపా కూడా అంతే నష్టం కలిగిస్తోంది. రాజకీయ పార్టీలు ఒకరినొకరు దెబ్బ తీసుకోవడానికి ప్రయత్నించడం సాధారణమయిన విషయమే. కానీ ఆ ప్రయత్నాలలో దేశానికి, రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ కలిగించకూడదనే ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలి.
ప్రతీ నగరంలోను, పట్టణంలోను ఇటువంటి అసాంఘీక శక్తులుంటాయి. అవి అసాంఘీక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాయి. వాటిని ఉక్కుపాదంతో అణచివేయడంలో ప్రభుత్వం విఫలమయినపుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీయే ఆ బాధ్యత తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావలసి ఉంటుంది. సమావేశాలు మొదలుకక ముందు ఈ సమస్యలన్నిటినీ ఏకరువు పెట్టి వాటిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఐదు రోజుల సమావేశాలలో రెండు రోజులు బహిష్కరించి బయటకు వెళ్లిపోవడం సరయిన నిర్ణయం కాదు. తద్వారా ఆయన తన బాధ్యతను నిర్వర్తించలేకపోయినట్లే భావించవలసి ఉంటుంది . కానీ వైకాపా చేసిన ఈ విషప్రచారం కారణంగా విజయవాడ అంటే నేరాలకు అడ్డా అనే భావన వ్యాపింపజేయగలిగింది.
కాల్ మనీ, దానితో ముడిపడున్న సెక్స్ రాకెట్ వ్యవహారం చాలా తీవ్రమయిన విషయమే. కనుక అధికార, ప్రతిపక్షాలు కలిసి వాటిని నియంత్రించి నేరస్తులను శిక్షించడానికి, అలాగే బాధితులకు న్యాయం చేయడానికి అవసరమయిన చర్యలు చేప్పట్టేందుకు శాసనసభలో చర్చించాలి. కానీ సభలో ఏమి జరిగిందో అందరూ కళ్ళారా చూసారు. శాసనసభ సమావేశాలు నేటితో ముగిసిపోతాయి. వైకాపా చేసిన ప్రచారం కారణంగా ప్రభుత్వం అప్రమత్తమయింది కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. బహుశః మరికొన్నిరోజుల తరువాత ఇంతటి సీరియస్ సమస్యల గురించి ఇక ఎవరూ మాట్లాడకపోవచ్చును. అప్పుడు మళ్ళీ ఈ నేరాలన్నీ యధాప్రకారం జరగడం మొదలయిపోయినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే “ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డెడ్” అన్నట్లుంటుంది.