తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇటీవలి కాలంలో ఫేక్ దాడి పెరిగిపోయింది. పాత ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న నిర్వహణ పరమైన లోపాలను అపచారం జరిగిపోయిందని రచ్చ చేస్తున్నారు. శ్రీవారి విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. భక్తులకు కొండపై మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. ఈ అనుభవం గతంలో.. ఇప్పుడు వెళ్లి వస్తున్న భక్తులకు తెలుస్తుంది. అయితే శ్రీవారిపై రాజకీయ కుట్రలు చేయడంలో సిద్ధహస్తులైన వారు మరోసారి రంగంలోకి దిగుతున్నారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రమణదీక్షితులు లాంటి వారినే ట్రాప్ చేసి… తప్పుడు ప్రచారాలు చేయించారు. పోటులో తవ్వకాలన్నారు. పింక్ డైమండ్ అన్నారు. అలాంటి వారు ఇప్పుడు మరింతగా బరి తెగిస్తున్నారు. గోవులపై మరణాలంటూ ఫేక్ ఫోటోలతో వచ్చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన భక్తులెవరో సంప్రదాయాలు తెలియక పాదరక్షలతో క్యూలైన్లోకి వస్తే అది కూడా పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుమల మాడ వీధుల్లోనే భక్తులు చెప్పులు ధరించరు. తిరుమలలో క్యూ కాంప్లెక్స్ లోకి వచ్చినప్పటి నుంచి పలు చోట్ల తనిఖీలు చేస్తారు. కానీ అక్కడ గుర్తించలేదు. బ్యాగులు స్కాన్ చేస్తారు కానీ కాళ్లకు చెప్పులు ఉంటాయో లేదో గుర్తించరు. నిజానికి చెప్పులు వేసుకోవడాన్ని భక్తులు అపచారంగా భావిస్తారు. అలిపిరి నుంచి లేదా శ్రీవారి మెట్ల మార్గం నుంచి నడిచి వచ్చేవారు కూడా చెప్పులు వేసుకోరు. ఎంత ఎండగా ఉన్నప్పటికి వారు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్క భక్తుడు కూడా చెప్పులతో మాడ వీధుల్లోకి కానీ.. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి కానీ రారు.
ఉత్తరాదికి చెందిన వారు.. కొత్తగా తొలి సారి తిరుమల ఆలయానికి వచ్చిన వారికి మాత్రం ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వారికి సిబ్బంది అసలు విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ భక్తులు ఎవరూ అలా రారన్న గుడ్డి నమ్మకంతో తనిఖీల చూపు కాళ్ల వైపు ఉండటం లేదు. దీంతో అపచారం జరగబోయింది. ఆలయంలోకి చెప్పులతో వెళ్లకుండానే ముందే గుర్తించారు. అయినా రచ్చ చేస్తున్నారు. ప్రతీ విషయంలో నూ వివాదం చేసి శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీసి..భక్తుల నమ్మకాన్ని తగ్గించాలన్న కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.