వైసీపీ ఫేక్ ప్రచారాన్ని చూసి చూసి ఒక్క సారిగా యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు పోలీసులు. తప్పుడు ప్రచారాలు చేయడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం దగ్గర నుంచి మహిళలపై అసభ్యంగా మాట్లాడుతున్న ఖాతాలను కూడా ఇప్పటి వరకూ స్కాన్ చేసి వరుసగా కేసులు పెట్టడం ప్రారంభించారు. ఆదివారం ఒక్క రోజే వందకుపైగా అకౌంట్లను గుర్తించి కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లపై చూసీ చూడనట్లుగా ఉన్నారు. దీంతో ప్రజాస్వామ్య పాలనలో ఇష్టం వచ్చినట్లుగా బూతులందుకోవచ్చని కొంత మంది అనుకున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సహా మహిళా మంత్రులను కూడా వదలకుండా మార్ఫింగ్ చేస్తున్నారు. కానీ ఇలా చేసే ట్రాప్ చేశారేమో కానీ అందరూ గుంపగుత్తగా ఇరుక్కున్నారు.
వైసీపీ సోషల్ మీడియాలో పాత ఖాతాలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వారంతా ఇప్పుడు కనిపించకుండా పోయారు. వారంతా ఖాతాల్ని డీయాక్టివేట్ చేసుకుని వేరే పేర్లతో మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చారు. మొదట్లో కేసులు పెడతారేమోనని కాస్త పద్దతిగా ఉన్నారు కానీ తర్వాత రెచ్చిపోవడం ప్రారంభించారు. ఇప్పుడు వారందరి పని పట్టేందుకు సిద్దమయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టరు కానీ ఇదే అవకాశంగా తీసుకుని మహిళలు, చిన్న పిల్లలపై మార్ఫింగ్లు చేయడం..కుల, మత విద్వేషాలు పెట్టడాన్ని మాత్రం సీరియస్ కేసులుగానే పరిగణిస్తారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నిజాలు చెప్పినా పోలీసుల కేసులు పెట్టేవారు. ప్రశ్నించినా వదిలి పెట్టేవారు కాదు. కొంత మంది సోషల్ మీడియాకార్యకర్తల్ని అరెస్టు చేసి వారిపై గే అనే ముద్ర కూడా వేసేవారు. మీడియాకు తప్పుడు లీకులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా చేయకుండా నేరుగా అరెస్టులు చేసే అవకాశం ఉంది.