ఏపీ బీజేపీలో మూడు వర్గాలుంటాయి. ఓ వర్గం ప్రో వైసీపీ. సోము వీర్రాజు నేతృత్వంలో ఈ టీం ఉంటుంది. మరొకటి ప్రో టీడీపీ. వైసీపీని వ్యతిరేకించేవళ్లంతా ఈ టీంలో ఉంటారు. సహజంగానే పొత్తుల గురించి వస్తే టీడీపీ వైపు మొగ్గుతారు మూడో టీం కూడా ఉంటుంది. వీరంతా నిఖార్సైన బీజేపీ. బీజేపీకి ఏది మేలో అది చేస్తూంటారు.. ఎమ్మెల్సీ మాధవ్ వంటి వారు ఈ జాబితాలో ఉంటారు. కానీ అలాంటి వారు మాత్రం ఎప్పుడూ అడుగునే ఉంటారు. రెండు వర్గాల వారు మాత్రం హైలెట్ అవుతూంటారు ఇప్పుడు పొత్తుల హంగామాలో.. తెర ముందుకు వచ్చి ప్రో వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని.. ఇంక నష్టపోమని సునీల్ ధియోధర్ ప్రకటించారు. టీడీపీతో పొత్తుతో వడిపోయి ఐదేళ్లయింది. గత ఐదేళ్లలో బీజేపీ ఎంత మెరుగుపడింది ? ఇంకా దిగజారిపోయింది. ఏ మాత్రం బలం పెంచుకోలేదు. వైసీపీతో దగ్గరగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి. తెలంగాణలో అక్కడి నేతలు పార్టీని మెరుగుపర్చుకున్నారు. కానీ ఏపీలో ఎందుకు ఇలా ఉంది ? తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించింది. టీడీపీతో పొత్తు లేక ఒక్కటంటే ఒక్క చోట కూడా డిపాజిట్లు తెచ్చుకోలేకపోయింది. ఉపఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయకపోయినా.. జనసేన మద్దతుతో పోటీ చేసిన బీజేపీ డిపాజిట్లు తెచ్చుకోలేకపోయింది.
అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కన్నా… వైసీపీకి పరోక్ష సాయం చేయడమే తమకు మేలన్నట్లుగా సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ.. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ఎక్కడా చెప్పడం లేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇచ్చే ఒకటీ అరా సీట్లు కూడా తమకు నష్టమేనని వారనుకుంటున్నారు. అయినప్పటకీ బీజేపీ నేతలు మాత్రం తగ్గడం లేదు.