వైకాపా మద్దతుదారులు అడ్డంగా బుక్కయ్యారు..! ఎక్కడో యూపీలో జరిగిన ఓ ఘటనను, ఏపీ జరిగిపోయిందంటూ ఫేస్ బుక్ లో దుష్ప్రచారం చేశారు. ఫలితంగా పోలీసులు కేసులు నమోదు చేశారు! వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్ర విజయవాడకు చేరుకున్న సమయంలో.. అక్కడి మద్దతుదారులు సోషల్ మీడియాలో హడావుడి చేశారు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓ వీడియోని ఫేస్ బుక్ ద్వారా షేర్స్ చేయడం మొదలుపెట్టారు.
ఎనిమిది మంది పోలీసులు, ఓ ముగ్గుర్ని చితకబాదుతున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. దీన్ని వైకాపా మద్దతు ఫేస్ బుక్ పేజీల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు. విజయవాడ పోలీసులు సామాన్యులను చితకబాదుతున్నారనీ, జగన్ పాదయాత్రను చూసేందుకు వస్తున్నవారిని ఇలా అడ్డుకుంటున్నారంటూ కామెంట్లతో ఈ వీడియో షేరింగులు చేశారు. జగన్ పాదయాత్ర విజయవంతం కాకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర ఇది అంటూ ఫేస్ బుక్ లో ప్రచారం సాగించారు.
ఈ విషయం తెలుసుకున్న విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫేస్ బుక్ పేజీల ఎడ్మిన్లపై రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం ఇదే విషయాన్ని మీడియాకి చెప్పారు. వైకాపా మద్దతుదారులు షేర్ చేస్తున్న వీడియోలో ఘటన యూపీలో చోటు చేసుకుందనీ, భారత్ బంద్ సందర్భంగా ఎక్కడో జరిగిన ఘటనను తీసుకొచ్చి, దాన్ని విజయవాడ పోలీసులు చేశారంటూ దుష్ప్రచారం చేశారంటూ అధికారులు చెప్పారు. ఫేస్ బుక్ లో ప్రచారంలోకి ఇచ్చిన ఈ వీడియో మొదటగా ఎక్కడి నుంచి పోస్ట్ అయిందన్నది కూడా గుర్తించినట్టు అధికారులు చెప్పారు. నిజానికి, జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత ఫేస్ బుక్ లో రకరకాల ప్రచారాలు ఎక్కువైపోయాయి! ఆ మధ్య, ఎక్కడో కేరళలో సన్నీ లియోన్ పర్యటన సందర్భంగా వేల మంది జనాలు వస్తే… ఆ ఫొటోని తీసుకుని జగన్ ను చూడ్డానికి వచ్చిన అభిమాన సందోహం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది! ఆ ఫొటో మెట్రో రైలు ఉండే సరికి.. ఆంధ్రాలో మెట్రో రైలు ఎక్కడిదంటూ కామెంట్లు రావడం, ఇది కేరళ ఫొటో అని తరువాత తేలడంతో ఆ పోస్టు కొన్నాళ్ల తరువాత మాయమైంది.