అనుకున్నట్టుగానే విజయసాయిరెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ నోటీసులు జారీ చేయడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ ను రెట్టింపు చేస్తూ సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చారు విజయసాయి. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని కోరితే..తనకు ఆరోజు ముందే ఫిక్స్ చేసుకున్న పనులు ఉన్నాయని.. అవసరమైతే ఓ రోజు ముందుగానే విచారణకు అవుతానని సమాధానం ఇవ్వడం వైసీపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది.
సాధారణంగా ఏదైనా కేసులో సిట్ ఏర్పాటు చేసి.. నోటీసులు ఇస్తే ఎవరైనా ముందుగా చెప్పేది. తనకు ఇప్పుడు కుదరదు.. వారం, పది రోజులు సమయమివ్వాలని గడువు కోరుతారు. కానీ, విజయసాయిరెడ్డి మాత్రం గడువు ఇవ్వమని కోరకుండా ఓ రోజు ముందుగానే విచారణకు వచ్చేస్తా అంటూ సిట్ అధికారులకు లేఖ రాయడం సంచలనంగా మారింది.
లిక్కర్ స్కామ్ పాత్రధారి వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని విజయసాయిరెడ్డి ఎప్పుడో తేల్చి చెప్పారు. మద్యం కుంభకోణంపై విచారణకు ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు చెబుతానని చెప్పడం వైసీపీకి ప్రాణం పోయినంత పని అయింది. సిట్ తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం, ఓ రోజు ముందుగానే విచారణకు వస్తానని రిప్లైతో వైసీపీ పుట్టి ముంచేలా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
లిక్కర్ స్కామ్ ను కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. అనుమానిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తోంది. కానీ, ఎవరిని అరెస్ట్ చేయలేకపోయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డికి మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన రావడం లేదు. అలాగే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నారు. విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఈ కేసు విషయంలో సిట్ దూకుడు నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.