వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అగ్రనేతలకు, ఆ పార్టీ మీడియాకు.. ఆ పార్టీ సానుభూతిపరులకు ఓ మాయ రోగం ఉంది. అదేమిటంటే.. తమ చేతుల్లో అధికారం ఉంటే ఆనందంగా ఉంటాం.. తాము ఆనందంగా ఉంటే.. ప్రపంచం అంతా ఆనందంగా ఉందని అనుకుంటారు. అదే తమకు అధికారం లేకపోతే ఇంత దుర్భరమైన ప్రపంచంలో మనమే బతకలేకపోతున్నాం.. ఇక జనం ఎలా బతుకుతున్నారని బాధపడిపోతూంటారు. తమ బాధను మొత్తం… మీడియా ద్వారా.. వెళ్లగక్కేస్తూంటారు. అది కూడా సొంత మీడియాతో. క్రిస్మస్ పండుగను అద్భుతంగా చేసుకునే ప్రజలు సంక్రాంతికి వచ్చే సరికి కష్టాల్లో కూరుకుపోయారని చెబుతూంటారు.
రాజకీయం మనుషుల జీవితాలను ప్రభావితం చేయాలంటే.. అది మంచి వైపే ఉండాలి. ఒక్క సారి అధికారం వచ్చిందని అందరి సంతోషాలను లాగేసుకుని మేము సంతోషంగా ఉండటం అంటే..మీరు సంతోషంగా ఉండటమేనని పాత సినిమాల్లో విలన్లుగా మారి.. వారి సంపాదనను.. ఆరోగ్యాన్ని కూడా పిండుకుని జల్సాలు చేసిన పాలన చేశారు. ఒక్క రోడ్డు వేయలేదు.. ఒక్క ఉపాధి చూపించలేదు.. రేషన్ బియ్యం,. పథకాల పేరుతో కాసిన్ని డబ్బులు అకౌంట్లలో జమ చేసి బానిసల్లా బతకమన్నారు. అదే సంక్రాంతి పండగ అనేవారు. ఇప్పుడు ఆ బాధల నుంచి ప్రజలు విముక్తి పొందారు. కానీ తమ జల్సాలు తగ్గిపోయే సరికి బాధపడుతున్నారు.
ఏపీ ప్రజలు ఓ పీడన పోయిందని సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. ప్రజల సంతోషం చూడలేక.. రేట్లు పెరిగిపోయాయని.. మరొకటని.. సంక్రాంతి శోభ లేదని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది . వారి మీడియాలో చెప్పుకుంటున్నారు. వారి తీరు చూసి.. వైసీపీకి ఆనందం లేకపోతే అందరికీ అలాగే ఉంటుందన్నది ఓ భ్రమ లోకంలో బతుకుతున్నారన్న సెటైర్లు సహజంగానే పడుతున్నాయి. కానీ ఇలాంటి వాటిని వారు పట్టించుకోరుగా !