ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష పార్టీ వైకాపా పోరాటం మొదట్నుంచీ ఇదే లక్ష్యంగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు తీర్చాల్సిన కేంద్రాన్ని వదిలేసి, ప్రయత్నిస్తున్న చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేయడం అలవాటైపోయింది. ఇక, జగన్ తాజా నిర్ణయం కూడా రాజకీయంగా టీడీపీని టార్గెట్ చేసుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయబోతున్నట్టు జగన్ తెలిపారు. ఈ నెల 5న వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా కోసం బయలుదేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు జగన్ ని కలిశారు. ప్రత్యేక హోదా పోరాటం చివరి దశకు చేరుకుందని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. ఈనెల 20 వరకూ పార్లమెంటులో హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. ఆ మర్నాడు, అంటే 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఏప్రిల్ 6న స్పీకర్ ఫార్మాట్ లో తమ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తారన్నారు.
చంద్రబాబు నాయుడు పార్టనర్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాతోనే అవిశ్వాసం పెడుతున్నామన్నారు. కానీ, దీనికి చంద్రబాబు మద్దతు ఇవ్వకపోవడంతో ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో మరోసారి బయటపడిందన్నారు. అంతేకాదు, చంద్రబాబు దగ్గరున్న ఎంపీలతో అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే బాధ్యత పవన్ మీద ఉందని జగన్ వ్యాఖ్యానించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడం అనేది చంద్రబాబు మొదటి అస్త్రం కావాలనీ, టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించడం రెండో ఆయుధం కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే, రాజీనామాలు ఆఖరి అస్త్రం అని చంద్రబాబు అనడం చూస్తుంటే, ఆయన మనోగతం ఏంటనేది అర్థమౌతుందన్నారు. టీడీపీ కలిసి వచ్చినా రాకపోయినా అవిశ్వాసం పెట్టడం ఖాయమన్నారు. చివరి దశలో అవిశ్వాసం అని చంద్రబాబు అంటున్నారనీ, రాష్ట్ర ప్రయోజనాల విషయమై ఆయన చిత్తశుద్ధి ఏంటనేది పదేపదే ప్రజలకు స్పష్టమౌతోందన్నారు.
కేంద్రంపై పోరాటం అని అంటున్నా, అది చంద్రబాబుపైనే అన్నట్టుగానే వైకాపా వ్యవహారశైలి కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగడమే చంద్రబాబు తొలి అస్త్రం కావాలంటున్నారు. ఒకవేళ వైదొలిగితే రాష్ట్ర ప్రయోజనాల మాటేంటీ..? ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఈలోగా పోరాటం చేసే అవకాశం ఉన్నప్పుడు… రాజీనామాలు చివరి అస్త్రం అవుతుంది. అధికారంలో లేని వైకాపా చివరి అస్త్రమే రాజీనామాలు అయినప్పుడు… అధికారంలో ఉంటూ ప్రజాప్రయోజనాలకు కట్టుబడి ఉంటున్న అధికార పార్టీకి అది మొదటి అస్త్రం ఎలా అవుతుంది..? కేవలం రాజీనామాలు చేయడంతోనే చిత్తశుద్ధి ప్రదర్శితం అవుతుందని జగన్ ఇప్పటికీ అనుకుంటున్నారు. నిజానికి, ఇక్కడ ప్రదర్శన ముఖ్యం కాదు, ప్రయోజనాలను రాబట్టుకోవడం ముఖ్యం. పోరాటం అంటే తెగతెంపులు కాదు… దాని కంటే ముందు రావాల్సినవి రాబట్టుకునేందుకు చేసే ఒక తీవ్ర ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నమూ విఫలమైతే టీడీపీ చేసేది కూడా తెగతెంపులే! ఆ ప్రయత్నాన్ని కూడా చిత్తశుద్ధి లేమిగా చిత్రించే ప్రయత్నం జగన్ చేస్తుంటే… ఇక రాష్ట్ర ప్రయోజనాల అంశమై వారికున్న చిత్తశుద్ధి ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది..?