హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యే అనితపై చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో రావటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ వ్యాఖ్యల వీడియోను ఎడిట్ చేసి క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాలో లీక్ చేశారని వైసీపీ శాసన సభ్యులు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, జ్యోతుల నెహ్రూ ప్రభృతులు ఇవాళ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానానికి అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు నోటీస్ ఇచ్చి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. శాసనసభకు చెందిన వీడియో బయటకు రావటం అక్రమమని, సభ సొత్తును స్పీకర్ కాపాడలేకపోయారని విమర్శించారు. స్పీకర్ అనుమతి లేకుండా ఆ క్లిప్పింగులు బయటకు ఎలా వస్తాయని అన్నారు. రోజా వ్యాఖ్యలు రికార్డ్ చేయటానికి ప్రత్యేక మైకులు పెట్టి రికార్డ్ చేశారని, ఆ వ్యాఖ్యలను రాసుకోవటానికి స్టెనోలకు కూడా పెట్టారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రోజా సస్పెన్షన్‌పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుడు నిబంధనను కోట్ చేస్తే స్పీకర్ కోడెల కూడా అదే తప్పుడు నిబంధనను కోట్ చేశారని, ఆ నిబంధన ప్రకారం రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించటానికి వీలు లేదని సుజయ కృష్ణ రంగారావు అన్నారు. స్పీకర్ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా, పక్షపాత పూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి కనీసం మైక్ ఇవ్వనందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పారు. గతంలోనూ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పటికీ, ఆయన తన వ్యవహారశైలి మార్చుకుంటారని భావించి కొందరు పెద్దల సూచనతో దానిని ఉపసంహరించుకున్నామని అన్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో గెలుస్తారా అని విలేకరులు అడగగా, అవిశ్వాసం పెట్టేందుకు కావల్సినంత బలం తమకు ఉందని, అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఓటింగ్ వచ్చినపుడు గెలిచే విషయాన్ని చూస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై 67 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.