న్యాయమూర్తులు వెళ్లే దారిలో వైసీపీ నేతలు హెచ్చరికల ఫ్లెక్సీలు పెట్టడం దుమారం రేపుతోంది. తాడేపల్లి వారధిపై రెండు, మూడు రోజులుగా ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఎమ్మెల్యే జోగి రమేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. రాజ్యాంగ వ్యవస్థల పేరుతో ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే… చూస్తూ ఊరుకోబోమని ఆ ఫ్లెక్సీల్లో హెచ్చరికలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బహిరంగంగా రాజ్యాంగ వ్యవస్థలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా న్యాయవ్యవస్థ విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు నేపధ్యంలో వైసీపీ నేతలు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్లో సైతం న్యాయవ్యవస్థను తప్పు పడుతూ ఆ పార్టీ ఎంపీలు మాట్లాడారు.
అదే సమయంలో బయట కూడా న్యాయవ్యవస్థపై అనుమానాలున్నాయని ప్రకటనలు చేశారు. ఇలాంటి తరుణంలో వైసీపీ నేతలు అత్యుత్సాహంగా పార్టీ పెద్దల మెప్పు పొందేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యవహారాలు బయటకు తెలిసిన వెంటనే తీయించేస్తారు. కానీ ఈ ఫ్లెక్సీలు ఇప్పటికీ వారిధిపై కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో వైసీపీ పెద్దల అనుమతితోనే ఇవి పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
151 సీట్లు వచ్చాయంటే దానర్థం.. చట్టాలు. రాజ్యాంగాలను పట్టించుకోకుండా.. నియమాలను నిబంధనలు ఉల్లంఘించి అయినా ఏదైనా చేయవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అవి న్యాయసమీక్షలో నిలవడం లేదు. అయితే ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థ తమ నిర్ణయాలను కొట్టి వేస్తోందని అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగి..అన్ని రకాలుగా న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.