ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినం. పైగా అధికార పార్టీ. ఎప్పుడూ లేనంత నిరాశ.. నిరుత్సాహం ఆ పార్టీలో కనిపిస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ నాయకత్వం కూడా పిలుపునివ్వలేదు. పిలుపునిచ్చినా దిగువ స్థాయి క్యాడర్ అలాంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని ఎప్పుడో మర్చిపోయింది. ఆర్థికంగా ఏ మాత్రం బాగుపడకపోగా మరింత అప్పుల పాలు చేశారనే అసంతృప్తిలో క్యాడర్ ఉంది.
ఇక పదవులు అనుభవిస్తున్న కొంత మంది కార్య.క్రమాలు చేయాలి. వారు హైకమాండ్ చెబితే తప్ప ఏమీ చేయలేని ఓ రిమోట్ కంట్రోల్ పరిస్థితికి చేరిపోయారు. చివరికి పై నుంచి ఆదేశాలు వస్తే తప్ప మాట్లాడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ కూడా ఆవిర్భావ దినాన్ని గొప్పగా నిర్వహించాలని ఎవరికీ చెప్పలేదు. పార్టీ కార్యాలయంలో ఎప్పట్లాగే జెండా ఎగరేస్తారు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ హాజరు కారు. ఈ సారి కూడా హాజరు కాకపోవచ్చు. కానీ ప్రతీ సారి కన్నా ఈ సారి పరిస్థితి మరీ దారుణం గా ఉంది.
తాము అధికార పార్టీలో ఉండి.. .. తమ ఎంపీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకాను దారుణంగా హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మద్దతుగా వియ్ స్టాండ్ విత్ అవినాష్ రెడ్డి అనే ట్యాగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ స్టాండ్ అనేది కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఆవిర్భావ దినం.. ఓ అధికార పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేని విధంగా జరుగుతోంది.