వైసీపీని ఓడించడమే లక్ష్యమని జనసేన తీర్మానం చేసింది. ఈ మేరకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదాన్ని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యామ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని మరోసారి తెలిపారు. టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను పాటిస్తామని… ఎన్నికల సమయానికి ఉండే పరిస్థితులను బట్టి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటామన్నారు. తమ స్ట్రాటజీ తమకు ఉందని పవన్ కల్యామ్ స్పష్టం చేశారు.
ఆదివారమే జనవాణిలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందన్నారు. టీడీపీ, వైసీపీలకు కొమ్ము కాసే ప్రశ్నే లేదన్నారు. ఆ మాట అన్న ఒక్క రోజే మళ్లీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యమని ప్రకటించారు. పైగా పీఏసీలో తీర్మానం చేశారు. ఓట్లు చీలనివ్వబోమని స్పష్టంగా చెప్పినందున.. ఆయన పొత్తులకే రెడీ అయినట్లుగా భావిస్తున్నారు. ఓట్లు చీలకూడదు అంటే.. పొత్తు పెట్టుకోవాల్సింది టీడీపీతోనే తప్ప.. మరో పార్టీ లేదు. అయినా టీడీపీతో పొత్తు పెట్టుకుంటామో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.
పవన్ కల్యాణ్ ఇలాంటి గందరగోళ ప్రకటనలు చేయడంతో జనసైనికుల్లోనూ గందరగోళమే ఏర్పడుతోంది. ఎలా స్పందించాలో వారికీ అర్థం కావడం లేదు. పీఏసీ కమిటీ భేటీలో మొత్తం ఐదు తీర్మానాలు చేశారు. వైసీపీ విముక్త ఏపీ, అధికారానికి దూరంగా ఉన్న కులాలకు నిజమైన రాజకీయ సాధికారత, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ.. వెనుకబడ్డ ముస్లింల ఆర్థిక పరిపుష్టి , దివ్యాంగుల సంక్షేమం.. సామాజిక భరోసా జనసేన బాధ్యత మిగిలిన నాలుగు తీర్మానాలు. పవన్ కల్యాణ్ ఈ అంశానికైనా కట్టుబడి ఉంటే.. కాస్త క్లారిటీ ఉంటుంది. మళ్లీ సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తే గందరగోళం అయిపోతుంది.