తానా సభలో మాట్లాడుతూ జగన్ మీద పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జైళ్లలో మగ్గి వచ్చిన వాళ్లకే అంత ధైర్యం ఉండి , వారు అంత దర్జాగా తిరుగుతున్నప్పుడు సత్యాన్ని మాట్లాడే నేను ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి అని పవన్ కళ్యాణ్ తానా సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యల కి సభికుల నుండి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వచ్చాయి. ఆ వ్యాఖ్య చేయగానే కాసేపు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతలు కానీ, వైఎస్ఆర్సిపి అభిమానులు కానీ కిమ్మనకుండా ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యను ఎలా తిప్పి కొట్టాలో అర్థం కాక వారు సతమతం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇంగ్లీషులో Achilles heel అని ఒక పదం ఉంటుంది. కర్ణుడి కవచ కుండలాల మాదిరిగా అచిలెస్ అనే గ్రీకు రాజు కి ఉన్న బలహీనమైన శరీర భాగం అది. ఏ మనిషికైనా ఒక ప్రధాన బలహీనత ఉండి, అక్కడ కొడితే తిప్పి కొట్టలేక పోతాడో అలాంటి సందర్భాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి కూడా ఇలాంటి ఒక వీక్ పాయింట్ ఉంది. అదే ఆయన చేసిన అవినీతి, ఆ తర్వాత దాదాపు ఏడాది పాటు అనుభవించిన జైలు జీవితం. కోర్టుల్లో నిరూపణ అయ్యేదాకా జగన్ దోషి కాదు అని అడ్డంగా వాదించే వైఎస్ఆర్సిపి అభిమానులు సైతం 2004 లో పది లక్షలకు మించని జగన్ ఆస్తి తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక అధికారికంగానే 100 కోట్ల దాకా టాక్స్ కట్టే స్థాయికి ఆస్తి ఎలా చేరిందన్నది చెప్పమంటే నీళ్ళు నములుతూ ఉంటారు. సరిగ్గా అటువంటి వీక్ పాయింట్ ని ఆధారంగా చేసుకొని పవన్ కళ్యాణ్ పేల్చిన మాటల తూటాలు ఇప్పుడు వైఎస్ఆర్సిపి అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నాయి.
అదేవిధంగా డబ్బులు ఇచ్చి ఓట్లు వేసిన ప్రజలకు సైతం పవన్ కళ్యాణ్ సున్నితంగా చురకలంటించారు. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తే , ఎలాగో వీరి ఓట్లు డబ్బుతో కొనేసాం కాబట్టి వీరికి ఏమీ చేయవలసిన అవసరం లేదు అని పాలకులు భావిస్తారు అని హెచ్చరించారు. ఏది ఏమైనా ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైస్సార్సీపీ నేతలలో, అభిమానులలో చర్చకు దారితీశాయి.