నంద్యాల ఓటమి తరువాత వైకాపా దిద్దుబాటు చర్యలకు దిగుతుందని అనుకున్నాం. 2019 కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల నాంది అన్నారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఈ ఎన్నిక ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని వారే చెప్పారు. అలాంటప్పుడు, ఓటమిని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? పార్టీలో విస్తృత చర్చ జరగాలి. కానీ, అలాంటిదేం జరుగుతున్నట్టుగా లేదక్కడ. నంద్యాల ఫలితంతో డీలా పడ్డ పార్టీ శ్రేణులను ఆలోచింపజేయాల్సిన సమయం ఇది. నంద్యాల ఫలితం పునరావృతం కాకుండా, ఎంతో బాధ్యతాయుతంగా శ్రేణులు ముందుకు కదలాలనే సందేశం పార్టీ అధిష్టానం నుంచి కింది స్థాయికి చేరాలి. కానీ, అలాంటి కసరత్తు జరుగుతున్న దాఖలాలే లేవు. పైపెచ్చు, నంద్యాల ఓటమిని మరచిపించి, కేడర్ లో ఉత్సాహం నింపేందుకు హుటాహుటిన ప్రచార కార్యక్రమాలకు సిద్ధమౌతూ ఉండటం విశేషం!
సెప్టెంబర్ 3 నుంచి 9 వరకూ నియోజక వర్గాల ఇన్ఛార్జ్ లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. దీంతోపాటు వైయస్సార్ కుటుంబం పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దీన్లో భాగంగా చంద్రబాబు నాయుడు సర్కారు వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ప్రజా బేలెట్ పేరుతో కరపత్రాలను పంచబోతున్నారు. అంతేకాదు, వైకాపా అభిమానుల ఇళ్లకు స్టిక్కర్లు అతికించబోతున్నారు. గుంటూరులో ప్లీనరీలో ప్రకటించిన నవరత్న హామీలపై కూడా విజయ శంఖారావం అనే సభ నిర్వహించనున్నారు. అక్టోబర్ నెలలోనే ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు కూడా అధికార పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలే ప్రధానాస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లాలని వైకాపా అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అవినీతి, గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టుల్లో అవినీతి వంటి అంశాలపై పెద్ద ఎత్తున ప్రచారానికి సిద్ధమౌతోంది.
నంద్యాల ఓటమి నుంచి బయటపడేందుకు మరోసారి ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా. కానీ, ఈ క్రమంలో నంద్యాల నుంచి ఏ పాఠమూ నేర్చుకున్నట్టుగా లేదు. నంద్యాలలో వైకాపా ఓటమికి ప్రధాన కారణం మితిమీరిన విమర్శలే అని అందరూ అంటున్నారు. సొంతపార్టీలో కూడా అదే అభిప్రాయం వ్యక్తమౌతున్నట్టు కూడా కథనాలు వచ్చాయి. చంద్రబాబు పాలనపై సైద్ధాంతిక విమర్శలు చేస్తే ప్రజలు హర్షించేవారు. కానీ, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలకు దిగడమే అక్కడ ఓటమికి కారణంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. నెగెటివ్ ప్రచారాన్ని ప్రజలు హర్షించరనీ, అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ గెలుపు ఉదహరించి మరీ విశ్లేషకులు వాపోతున్నారు. కానీ, నంద్యాల ఫలితంపై వైకాపాలో అంత లోతైన చర్చకు సమయం లేకుండా చేస్తున్నారు. కనీసం, వైకాపా ప్రముఖ నేతలంతా సమావేశమై ఫలితాన్ని విశ్లేషించుకునేట్టుగా కూడా లేరు. ఓటమిని మరిపించాలని అనుకుంటున్నారే తప్ప, దాన్నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చేమో అనే ప్రయత్నం కనిపించడం లేదు. చంద్రబాబుపై విమర్శలతోనే ప్రజల్లోకి వెళ్లడమే సరైందని జగన్ భావించడం వెనక, ఆయనకున్న ఆత్మవిశ్వాసం ఏంటో మరి?