గడప గడపకూ మన ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ నేతలందర్నీ ప్రతి ఇంటికి పంపిస్తున్న సీఎం జగన్ తాను మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కదలడంలేదు. ఎప్పుడైనా పథకాల మీట నొక్కాల్సిన పని ఉంటే ఏదో ఓ జిల్లాలో ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. అక్కడకు హెలికాఫ్టర్లో వెళ్లీ మీట నొక్కేసి అదే విధంగా తిరిగొస్తున్నారు. కానీ ఆయన ప్రజల్లోకి వెళ్లే పనేమీ పెట్టుకోవడం లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లిన సందర్భమే లేదు. పూర్తిగా తాడేపల్లి క్యాంపాఫీస్కే పరిమితమయ్యారు.
మొదట్లో ప్రజాదర్భార్ పెడతామని చెప్పారు. కానీ పెట్టలేదు. తర్వాత పలు సందర్భాల్లో తాను జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నానని… ఎవరైనా పథకాలు అందలేదని చేతులెత్తితే అధికారుల సంగతి తేలుస్తానని హెచ్చరించారు. కానీ ఆ మాటలన్నీ అక్కడే ఉండిపోయాయి. జగన్ మాత్రం గడప దాటడం లేదు. ఎమ్మెల్యేలకు ఎనిమిది నెలల పాటు హోం వర్క్ గడప గడపకూ ఇచ్చినందున ఇక జగన్ వెళ్లే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.
ఇక నేరుగా ఎన్నికల ప్రచారానికే జగన్ జనం దగ్గరకు వెళ్తారని అంటున్నారు. అదే నిజం అయితే.. పాదయాత్ర చేసి ప్రజల్లోనే ఉండి సీఎం పదవి చేపట్టి.. ఆ తర్వాత ఐదేళ్ల పాటు వర్క్ ఫ్రం హోం చేసిన సీఎంగా రికార్డు సృష్టిస్తారు. ఇలా ప్రజల్లోకి వెళ్లని సీఎం ఎవరూ ఉండరన్న అభిప్రాయం కూడా ఏర్పడవచ్చు. మొత్తానికి జగన్… అ బెంచ్ మార్క్ సృష్టిస్తారని అనుకోవచ్చు.