స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఆ పార్టీకి మరో రకంగా కలిసి వస్తోంది . స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ ఆ పార్టీ స్వీప్ చేయబోతోంది. ప్రస్తుతం ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖళీగా ఉన్నాయి. ఇందులో మూడు మాత్రమే ఎమ్మెల్యే కోటా ఎన్నికలు. మిగిలిన పదకొండు స్థానిక సంస్థల కోటాలోనివి. కరోనా కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
వచ్చే నెలలో నిర్వహించవచ్చన్న సంకేతాలు పంపింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నందున స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇప్పుడు మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విపక్ష పార్టీలు పోటీ చేసే అవకాశం లేదు. దాదాపుగా 80 నుంచి 90 శాతానికిపైగా విజయాలు .. స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ ఖాతాలోనే ఉన్నారు.
అందుకే ఈ అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయి. ఈ పధ్నాలుగు ఎమ్మెల్సీ సీట్లను ఎవరెవరికి ఇవ్వాలన్నదానిపై ఇప్పటికే వైసీపీ హైకమండ్ కసరత్తు పూర్తి చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలు పూర్తయితే మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ వస్తుంది. అయితే మండలిని రద్దు చేయాలనే తీర్మానం కేంద్రం వద్ద ఉంది. ఆ తీర్మానం విషయం ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.