కడప జిల్లా రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరిగిపోతోంది. ఆ పార్టీ క్యాడర్ మొత్తం టీడీపీలోకి వెళ్లిపోతోంది. దాడులు, దౌర్జన్యాలు ఏమీ లేకపోయినా రాజకీయ భవిష్యత్ కోసం ఎక్కువ మంది అదే పని చేస్తున్నారు. వారికి భరోసా కల్పించడంలో వైసీపీ అధినాయకత్వం విఫలమవుతోంది. తాజాగా రవీంధ్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పదేళ్లు అధికారం చెలాయించిన కమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ను మార్చేయబోతున్నారు.
ప్రొద్దుటూరు, రాజంపేట మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి. చివరికి కడప మేయర్ స్థానంలో టీడీపీకి అధికారికంగా ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. ఇప్పుడు చేర్చుకోవాలంటే మొత్తం కార్పొరేషన్ టీడీపీలోకి వచ్చేలా సీన్ మారిపోయింది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే పులివెందున మున్సిపల్ కౌన్సిలర్లు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. వారికి జగన్ కాంట్రాక్టులు ఇచ్చారు కానీ బిల్లులు ఇవ్వలేదు. పార్టీ కోసం కాకపోయినా బిల్లుల కోసం అయినా టీడీపీలో చేరుతామని వారు సంకేతాలు ఇస్తున్నారు. ఇంకా టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
జడ్పీ చైర్మన్ పీఠం కదిలిపోవడంతో జగన్ రెడ్డి ప్రత్యేకంగా జడ్పీటీసీల్ని తాడేపల్లికి పిలిపించుకుని బతిమాలుకున్నారు. పరువు తీయవద్దని అడిగి.. తలా ఓ తాయిలం ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే .. వైసీపీని నడిపించే నాయకుడు కడప జిల్లాలో లేకుండా పోయారు. చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డిని నియమించారు . ఆ నిర్ణయం కూడా ఎదురు తన్నే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.