ఆంధ్రప్రదేశ్లో కరోనాను నిర్లక్ష్యం చేశారన్న అసహనం ప్రజల్లో కనిపిస్తూండగానే… ఇప్పటికే.. కరోనాను కంట్రోల చేశామన్నట్లుగా ప్రచారం చేయాడనికి వైసీపీ.. ఆ పార్టీకి చెందిన మీడియా తాపత్రయ పడుతోంది. వలంటీర్లే.. కరోనాపై యుద్ధానికి సైనికుల్లా పని చేస్తున్నారని సెల్ఫ్ కితాబులు ఇచ్చేసుకుంటున్నారు. వారి చొరవతోనే.. ఏపీలో కరోనా కంట్రోల్ లో ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు.. ఆ పార్టీ మీడియా ప్రచారం చూసి.. జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఇంతకీ వలంటీర్లు ఏం చేస్తున్నారంటే.. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నారట. దీని కోసం ఇంటిటికి సర్వే చేస్తున్నారట. నిజానికి వలంటీర్లు ఇలా ఇంటింటికి తిరగడమే ప్రమాదకరం. ఆ విషయంపై ఎన్నో విమర్శలు వస్తున్నా.. వైసీపీ దాన్ని అడ్వాంటేజ్ గా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి వలంటీర్లు అవసరం లేదు. ఎయిర్పోర్టుల మంత్రిత్వ శాఖ .. ప్రయాణికుల వివరాలన్నింటినీ.. ఇస్తుంది. అది పది నిమిషాల పని. వాటి ఆధారంగా… విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం పెద్ద కష్టం కాదు. వలంటీర్లు ఇంటింటికి వెళ్లినప్పుడు.. ఎవరూ కూడా ఇప్పుడు తాము విదేశాల నుంచి వచ్చామని చెప్పుకోవడం లేదు. క్వారంటైన్, ఐసోలేషన్ అనే పదాలకు వారు భయపడుతున్నారు. తమకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు కాబట్టి… వారు చెప్పడం లేదు. ఈ కారణంగానే… విశాఖలో కరోనా సోకిన వ్యక్తి.. విదేశాలకు వెళ్లి వచ్చినా.. వాలంటీర్లు వివరాలు సేకరించలేకపోయారు.
వలంటీర్ల వ్యవస్థ ద్వారా రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో… ఆ వలంటీర్లకు క్రెడిట్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ హోం డెలివరీ కూడా ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదు. ఇంటి ఆవరణలోనే పెట్టి వెళ్తున్నారు. పది ఇళ్లు తిరిగేవారిని ఇంట్లోకి రానివ్వడమే డేంజర్ అన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. వాలంటీర్లను ..గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించి.. కరోనాపై పోరాటంలో వారిని యోధులుగా సర్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు.