వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అమరావతి విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. రోజుకొకరితో మూడు రాజధానులు కట్టి తీరుతామని ప్రకటిస్తారు. దీనిపై సోషల్ మీడియాలో ముందు రోడ్లపై గుంతలు పూడ్చండి అన్నా తర్వాత మూడు రాజధానులు కడుదులు అని సెటైర్లు వేస్తున్నారు. అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మూడు రాజధానులే మా విధానం అంటున్నారు. వీలైనంతగా ఈ అంశాన్ని చర్చించడానికి అవకాశం కల్పిస్తున్నారు.
మూడు రాజధానులు అసాధ్యమని వైసీపీకి తెలుసు. ఆ పార్టీ పెద్దలకూ తెలుసు. నిజంగా అవకాశం ఇచ్చినా మూడు రాజధానులు కట్టలేరని జనానికీ తెలుసు. కుదిరితే విశాఖను రాజధానిగా ప్రకటించి.. అక్కడి ఆస్తులను తాకట్టు పెట్టేయడమే ప్రభుత్వం చేయగలదని అందరికీ తెలుసు. రాజధాని చేయకుండానే చాలా ఆస్తులు తాకట్టు పెట్టేసింది. పెట్టడానికి ఇంకేం ఉందా అని చూస్తోంది. అది వేరే విషయం. అయినా వైసీపీ నేతలు కోర్టు తీర్పును సైతం ధిక్కరించేలా ఎందుకు మూడు రాజధానుల ప్రకటనలు చేస్తున్నారనేది కొంత మందికి ఉన్న సందేహం. దానికి సింపుల్ ఆన్సర్ . పాలనపై చర్చ జరగడం కన్నా మూడు రాజధానులపై చర్చ జరగడమే బెటరని వైసీపీ సర్కార్ భావిస్తోంది.
వైసీపీ పాలన పూర్తిగా తేలిపోయింది. సంక్షేమ పథకాల లబ్దిదారులు కూడా తమకు రూపాయి ఇచ్చి వంద రూపాయలు వెనక్కి తీసుకుంటున్నారన్న ఆగ్రహంతో ఉన్నారు . ఆ విషయం ఓటీఎస్ వసూళ్లు.. చెత్తపన్ను వసూళ్ల విషయంలో తిరగబడుతున్న ప్రజలే సాక్ష్యం. ఇక ఏపీలో ఒక్క అభివృద్ధి లేదు. ఉద్యోగాలు లేవు. చివరికి తాపీ పని చేసుకునేవారి ఉపాధికీ ప్రభుత్వం గండికొట్టింది. ఊరు పక్కన ఏరు ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా నష్టపోనివర్గం లేదు. వీటిపై చర్చ జరిగితే ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వెల్లువెత్తుతుంది.
అందుకే వ్యూహాత్మకంగా కోర్టు తీర్పును ధిక్కరించేనా సరే మూడు రాజధానులను వీలైనంత ఎక్కువగా చర్చకు పెడితే.. అదే ప్రజల దృష్టిని మళ్లిస్తుందని నమ్ముతున్నారు. పాలనా వైఫల్యాల నుంచి రాజధాని భావోద్వేగం వైపు మళ్లిస్తే రెండు ప్రాంతాల ప్రజలు అండగా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కడుపు కాలిన సామాన్యుడికి రాజధాని ఏదయింతే ఏంది..? అనే ఓ అభిప్రాయానికి వస్తే ప్రభుత్వం వ్యూహం రెండురకాలుగా ఫెయిలయినట్లవుతుంది.