ప్రభుత్వం బాగా పని చేస్తే… చెప్పుకుంటున్నట్లుగా ప్రతి ఇంటికి పథకాలు ఇస్తే వాటితో వారు బాగుపడి ఉంటే …. ఓటు వేయాలని వారిని అడగక్కర్లేదు. తమ జీవితాల్ని బాగు చేసిన వారికి తప్పకుండా ఓటు వేస్తారు. అలా చేయకుండా… ఊరకనే మీరు బతికి ఉన్నారంటే కారణం మేమంటే మేమని ప్రచారం చేసుకుని ఓటు వేయాలంటే మాత్రం ఎవరు వేస్తారు ? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే చేస్తోంది. అత్యంత దారుణమైన పాలన అందిస్తూ… ప్రజలకు ఎంతో మేలు చేశామని స్టిక్కర్లు అంటించేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఎమ్మెల్యేలు నెలల తరబడి గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొత్తగా మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ అనే రెండు ప్రచార కార్యక్రమాలనూ ప్రారంభిస్తున్నారు. గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు ఇలా రకరకాల పేర్లతో క్యాడర్ ను రెడీ చేసుకుని ముందుకెళ్తున్నారు. నిజానికి ఇలా ప్రతీ ఇంటికి వెళ్లడం ఎందుకు.. నిజంగానే పథకాలు పొంది ప్రజలు బాగుపడి ఉంటే.. ఓట్లు వేయరా .. అనే సందేహమ సహజంగానే వస్తుంది. కానీ ఏపీలో ప్రభుత్వ పథకాలు పొందిన వారిలో సంతృప్తి లేదు. ప్రభుత్వం వంద ఇచ్చి రూ. వెయ్యి లాక్కుందని ఎదురు లెక్కలు చెబుతున్నారు జనం.
అందుకే ప్రచారంతో అందర్నీ నమ్మింంచాలని అనుకుంటున్నారు. దీనికి వ్యూహాలు ఖరారు చేస్తోంది ఐ ప్యాకే. జనంలో వ్యతిరేకత ను గుర్తించి.. నమ్మకం, విశ్వసనీయత అనేవి బొత్తిగా లేకుండా పోయాయని.. వాటిని పునరుద్ధరించడానికి స్టిక్కర్ల ఉద్యమం చేయాలని సలహా ఇచ్చారు. ఆ ప్రకారం పని ప్రారంభిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి పాలన చేసి.. ఇంటి ముందు స్టిక్కర్లు అంటిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చేయాల్సిన పనులు చేయకుండా ఇలాంటి స్టిక్కర్ల పనులు పెట్టుకుంటే.. వ్యతిరేకత మరింత పెరుగుతుందనే చిన్న లాజిక్‌ను వైసీపీ మర్చిపోయింది. అదే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరగడానికి కారణం అవుతోంది.