ఆంధ్రప్రదేశ్‌లో ఏడు నెలల కిందటి వరకూ.. పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగాలు, అమరావతి, పోలవరం అనే మాటలే వినిపించేవి. అధికారపక్షం తాము అన్నీ చేశామని లెక్కలు చెబుతూ ఉండేది. ప్రతిపక్షం అసలు ఏమీ చేయలేదని.. వాదిస్తూ ఉండేది. రాజకీయం ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం అయ్యేది. కానీ.. ఏడు నెలల్లో పరిస్థితి మారిపోయింది. అనవసర వివాదాలతో అల్లకల్లోలం అవుతోంది. సంబంధం లేని అంశాలను ప్రభుత్వమే వివాదాస్పదం చేస్తూ.. ప్రజల బతుకుల్ని.. అయోమయంలో పడేస్తోంది. పదవి చేపట్టినప్పటి నుండి.. ప్రజల మధ్య ఏదో ఓ చిచ్చు పెడుతూ.. ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోంది.
పూర్తి స్థాయిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు..!
ఏడు నెలల నుంచి ఏపీలో.. ఏ ఒక్క ప్రాజెక్టులో తట్ట సిమెంట్ పడలేదంటే నమ్ముతారా..? ఖచ్చితంగా నమ్మి తీరాలి. రివర్స్ టెండరింగ్ పేరుతో.. పనులన్నీ నిలిపివేసి.. లెస్‌కు కొత్త కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారు కానీ.. పనులు మాత్రం ప్రారంభించలేదు. ఏడు నెలలు పనులు ఆపేస్తే ఆ పనులు విలువ ఎంత పెరుగుతుందో.. చిన్న ఇల్లు కట్టిన వాడికైనా.. తెలిసిపోతుంది. కానీ ఇక్కడ పనులు జరగడం లేదు. పోలవరం కూడా ఆగిపోయింది. అమరావతి విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ ఇతర సాగునీటి ప్రాజెక్ట్ కూడా.. ముందుకు కదలడం లేదు. ఎంత ఘోరం అంటే.. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల పనులు కూడా నిలిపివేశారు. అంటే.. ఏపీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నమాట.
ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం..!
అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వారి మధ్య చిచ్చు పెట్టి.. కొట్టుకు చచ్చేలా చేసి.. తాను మాత్రం సుఖంగా మనుగడ సాగించాలనుకుంటోంది. అమరావతిపై కులం ముద్ర వేసి.. ఆ కులాన్ని అంటరాని వాళ్లన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అక్కడి రైతులపై పోలీసుల సాయంతో దమనకాండకు పాల్పడుతోంది. ప్రజలు తిరుగుబాటు పరిస్థితుల్లోకి వెళ్లినా.. తన చేతుల్లో పోలీసులు ఉన్నారనే ఆలోచన.. పాలకుల్లో కనిపిస్తోంది. దీంతో.. ఈ చిచ్చు పెట్టే ప్రక్రియ.. నిరంతరం సాగుతోంది. ప్రజల మానసిక పరిస్థితిని టార్గెట్ చేసి.. మరీ.. ఈ రాజకీయం చేస్తూ.. విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌తో ఆడుకుంటున్నారు.
ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి నోరూ కంపే..!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరి నుంచి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి నోరూ కంపే. ఆయన అసెంబ్లీలో చంద్రబాబును.. అనరాని మాటలంటారు. బయట గురువు చూపిన దారిలో శిష్యులు.. ఇతర పార్టీల నేతల్ని తల్లి, చెల్లి అని చూడకుండా.. అమ్మనా బూతులు మైక్ ముందే.. మాట్లాడేస్తూంటారు. ఇష్టం వచ్చినట్లుగా తిడితే… ఎదుటి వ్యక్తి మానసికంగా దెబ్బతిని తమ జోలికి రాకుండా ఉంటారనే ఫార్ములాను..వైసీపీ నేతలు అమలు చేస్తున్నారు. కానీ.. నైతికంగా… పూర్తిగా పాలనా పరమైన ఓటమిని అంగీకరించి.. చేతకాని తనాన్ని… కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసే వ్యూహమే అది.
రౌడీలదే రాజ్యం..!
ద్వారంపూడి వంటి నేతలు ప్రైవేటు సైన్యంతో దాడులు చేస్తారు.. తోపుదుర్తి లాంటి వాళ్లు.. కాంట్రాక్టర్లు కమిషన్లు ఇవ్వకపోతే.. హత్యాయత్నాలు చేస్తారు. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే.. పోలీసులే గూండాలుగా మారిపోతారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రౌడీ రాజ్యమనే మాటే వినిపిస్తోంది. అధికారం ఉందనే అహంకారంతో… సీఎం స్థాయి నుంచి కింది స్థాయి వరకూ వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. చేయాల్సినన్ని దాడులు.. దందాలు చేసుకుంటున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై.. కమ్మ, కాపు ముద్ర వేసి.. ఎదురుదాడి చేస్తున్నారు.
యథారాజ..తథాప్రజ..!
ముఖ్యమంత్రి స్వయంగా సీబీఐ కోర్టుకు వెళ్లి నిందితుడిగా నిలబడారు. ఓ నామినేటెడ్ పోస్టు పొందిన నేత.. మహిళా ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తారు. మరో నేత… రైతుల్ని బెదిరిస్తారు. ఇలా వరుసగా జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో ఎక్కడా పెట్టుబడులు .. ఉద్యోగాలు అనే మాట వినిపించడం లేదు. రోజూ.. దాడులు.. దాడులు.. దాడులు.. ఇవే మాటలు. ఎన్నికలకు ముందు… వైసీపీ గెలిస్తే.. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడది నిజం అవుతోంది.