విశాఖ మేయర్ సీటును కాపాడుకుంటామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వైసీపీ నాయకులు ఓటింగ్ రోజు దగ్గర పడే సరికి తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. శనివారం సమావేశం ఉన్నప్పటికీ వారిని తీసుకు రాలేదు. టీడీపీ, కూటమి కార్పొరేటర్లు నగరానికి చేరుకున్నారు. వైసీపీ సమావేశం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది.
కోరం లేదన్న కారణంగా సమావేశం జరగకుండా చూడాలని వైసీపీ అనుకుంటోంది. సగం మందికిపైగా సభ్యులు హాజరైతేనే సమావేశం నిర్వహిస్తారు. వైసీపీ సభ్యులు హాజరు కాకపోతే కోరానికి అవసరమైన సభ్యులు తక్కువ అయ్యే చాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఆ పరిస్థితి కూడా లేదని వైసీపీకి చెందిన చాలా మంది కార్పొరేటర్లు ఇప్పటికీ టీడీపీ, జనసేనలో చేరినందున కూటమికి మెజార్టీ ఉందని అంటున్నారు.
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మొత్తం 111 ఓట్లు ఉన్నాయి. వైసీపీ నుంచి చేరికలతో తెలుగుదేశం పార్టీ బలం 39మంది కార్పొరేటర్ల నుంచి 48కి చేరింది. జనసేన పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 14కు చేరింది. రాజీనామాలు, పార్టీ ఫిరాయింపులతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 59 నుంచి 31కి పడిపోయింది. బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. 11 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉంది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 74. ఇప్పటికి కూటమికి 75 ఓట్లు ఉన్నాయి.
వైసీపీ క్యాంపులో ఉన్న వారు కూడా కొంత మంది కూటమికి టచ్ లో ఉన్నారు. వారు సమావేశానికి హాజరైతే.. కూటమికే ఓటు వేస్తారు. అందుకే వారిని సమావేశానికి తీసుకు రావడానికి కూడా వైసీపీ కంగారు పడుతోంది.. వారు వచ్చినా రాకపోయినా.. విశాఖ మేయర్ పై అవిశ్వానం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.