బిజెపి వైసీపీ కలసి రాజకీయం చేస్తున్నాయనే టిడిపి ఆరోపణలు ఎలా వున్నా ఒక విషయంలో మాత్రం వారిద్దరి మధ్య తమాషా అయిన చర్చ నడుస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తన పాత్ర సరిగ్గా నిర్వహించడం లేదని గతంలో బిజెపి విమర్శించేదట. మేము సరే ప్రభుత్వంలో వుండి మాట్లాడలేకపోతున్నాము గాని మీరైనా సమర్థంగా చేస్తారనుకుంటే చేతులు ఎత్తేస్తున్నారని ఎగతాళి చేసేవారట. ఇటీవల వైసీపీ సభను బహిష్కరించిన తర్వాత ఇది మరింత పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు టిడిపి బిజెపి విడాకుల తర్వాత సన్నివేశం మారింది. వైసీపీ ఇప్పటికీ సభకు వెళ్లడం లేదు గనక బిజెపినే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. హౌరాహౌరీ ఆరోపణలు కూడా సంధిస్తున్నది.వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టిడిపి నేతలు విరుచుకుపడటమే గాక చాలాసార్లు స్పీకర్ వారికి అవకాశాలు ఇవ్వడం లేదట. దాంతో బిజెపి నేతలు కూడా సభా నిర్వహణలో ఈ ప్రభుత్వం తీరు ఏంతమాత్రం బాగాలేదని కోపోద్రిక్తులవుతున్నారట. మీకు రెండు వారాల్లోనే ఇంత విసుగు కోపం వచ్చేస్తే మరి మూడేళ్లలో మాకెంత విసుగొచ్చి వుండాలని వైసీపీ నేతలు ఎదురు వడ్డించడం మొదలుపెట్టారు. అక్కడ అంపైర్ సరిగ్గా లేరు గనక ఆయనకే పాలకపక్షం స్వేచ్చ ఇవ్వడం లేదు గనక మేము వెళ్లినా సమయం దండగ అని బహిష్కరించాము.ఇప్పుడు బిజెపికి కూడా అనుభవం అవుతున్నది అని వైసీపీ కీలక నాయకులొకరు సరదాగా అన్నారు.