వైసీపీ అద్యక్షుడు జగన్మోహన రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన సమస్యలపై తనను కలిశారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇది ఆ పార్టీ నాయకులకు చాలా సంతోష కారణమైంది. ఎందుకంటే జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ఈడీ కేసుల గురించో మరో దాని గురించో మాట్లాడేందుకు వెళ్లారని ముందుగానే తీవ్ర ప్రచారం నడుస్తుంటుంది. ఆ అవకాశం లేకుండా రాష్ట్రపతి కార్యాలయమే ఫోటోతో సహా ఎందుకు కలిసింది ప్రకటించడం తమకు తలనొప్పి లేకుండా చేసిందని వారంటున్నారు. ప్రధాని మోడీ ప్రతిదీ ట్విట్టర్లో పెడుతుంటారు. ప్రణబ్ కూడా ఆ అలవాటు పెంచుకుంటున్నారేమో తెలియదు. కాని ఇలా చేయడం ఇదే మొదటి సారి అని వైసీపీ వర్గాలు మరింత ఆనందపడుతున్నట్టు ఈ రోజు రాత్రి నేను సాక్షి చర్చకు వెళ్లినప్పుడు అర్థమైంది. ఇక ఫిరాయింపులకు సంబంధించినంత వరకూ ఇంకా కొంత మంది గోడ దూకవచ్చుననే అంచనా వారిలో వుంది గాని పార్టీ తలకిందులై పోతుందని భావించడం లేదు. శాసనసభలో రోజాపై చర్చను స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పక్కదోవ పట్టించడానికే ఈ సమయాన్ని ఎంచుకున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. నేరుగా జనం మధ్యకు వెళ్లే జగన్‌ను ఇలాటివి ఏమీ చేయలేవని వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తమ వారిని టిఆర్ఎస్ చేర్చుకున్న సందర్భంలో చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఎపిలో ఎదురు కొడతాయన్నది వారి ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. కాని జగన్ వైఖరిలోనూ మార్పు అవసరమేనన్న మెళకువ మాత్రం వైసీపీ సలహాదారుల్లో పెద్దగా కనిపించకపోవడం విశేషం!