తన హయాంలో దర్యాప్తు సంస్థల్ని.. పోలీసుల్ని ఆటబొమ్మలుగా ఆడేసుకుని.. వాళ్లతో అడ్డగోలు పనులు చేయించేసుకున్న వైసీపీ నాయకత్వం ఇప్పుడు సీఐడీ అంటేనే ఉలిక్కి పడుతోంది. రేపంటూ ఉండదనేలా చేసిన నిర్వాకాలతో ఇప్పుడు.. ఆ రేపు వచ్చేసింది. తము సీఐడీని ఎలా ఉపయోగించుకున్నామో..ఇప్పుడు అధికారంలో ఉన్న వారు అలాగే ఉపయోగించుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటామో ఊహించుకుని వణికిపోతున్నారు.
సీఐడీకి ఏ కేసు అప్పగిస్తామన్నా… వైసీపీ నేతలు వద్దు వద్దని కోర్టుకు పోతున్నారు. ఎందుకంటే… చంద్రబాబు నేతృత్వంలో ఉన్న ఏజెన్సీలు ఆయన చెప్పినట్లే దర్యాప్తు చేస్తాయట. మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలు ఏం చేశాయి ?. ప్రభుత్వ ఏఏజీగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబుపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీలో… హైదరాబాద్ లో ప్రెస్మీట్లు పెట్టారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. మార్గదర్శిపై ఒక్క కేసు లేకపోయినా అడ్డగోలుగా వ్యవహరించారు. వారు చేసిన నిర్వాకాలు అన్నీ జగన్ రెడ్డి అహాన్ని తృప్తి పరచడానికేనని అందరికీ తెలుసు. అలా వాడుకుని ఇప్పుడు ప్రభుత్వం మారాక.. ఆ వ్యవస్థలన్నీ సుద్దపూసల్లాగా వ్యవహరించాలని అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది ?
ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టాల్సిన పని లేదు. జరిగిన నేరాల్ని బయటకు తీస్తే చాలు. సాక్ష్యాలతో సహా దొరికిపోయే తప్పులు చేశారు. అయితే.. సీఐడీ వాళ్లు వెలికి తీస్తే అది కక్ష సాధింపులని ప్రచారం చేసుకునే ప్లన్ లో ఉన్నారు. కానీ వారు గతంలో ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసిన తీరు చూస్తే… ప్రజలు కూడా మీరు నేర్పిన విద్యయేగా నీరజాక్ష అనుకుని సైలెంట్ అయిపోయారు. అంటే వైసీపీ వ్యవస్థని నాశనం చేయడం ద్వారా తన కన్నుల్ని తానే పొడుచుకుందన్నమాట.