షర్మిల ఏర్పాటు చేయబోతున్న రాజకీయ పార్టీ పై వైఎస్సార్సీపీ తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల పార్టీతో జగన్ కి కానీ వైఎస్ఆర్సిపి కి కానీ ఎటువంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో వైఎస్ఆర్సిపి కార్యకలాపాలు విస్తరించడానికి జగన్ విముఖత:
సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, జగన్ వై ఎస్ ఆర్ సి పి ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ ఉద్దేశాలతో వ్యూహాలతో ఏర్పాటు చేయలేదని , వైఎస్ఆర్ మరణం తర్వాత ఏర్పడ్డ ఆ నాటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా వైఎస్ఆర్సిపి రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది అని అన్నారు. అయితే ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కావాలని జగన్ నిర్ణయించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలోనూ రాజకీయాలు చేయాలనుకుంటే అవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ తెలంగాణలో రాజకీయాలు చేయకూడదని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారని, తమ పార్టీకి తెలంగాణలో కూడా రాజకీయ అవకాశం ఉందని, కానీ జగన్ నిర్ణయం కారణంగా అభిమానులు కోరినప్పటికీ వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ కి పరిమితమైందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మొన్నటి జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా సైతం వైఎస్ఆర్సిపి కార్యకలాపాలు తెలంగాణలో విస్తరిస్తే బాగుంటుందన్న సూచన అభిమానుల నుండి వచ్చిందని ఉన్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
వైకాపా కి సంబంధం లేదు:
షర్మిల ఈ రోజు నుండి ఆత్మీయ సమావేశాలు మొదలు పెట్టిన దరిమిలా, ఈ విషయమై తాము స్పందించకపోతే రకరకాల కథనాలు ,రూమర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తాను స్పందిస్తున్నానని తన ప్రెస్ మీట్ మొదలుపెట్టారు రామకృష్ణారెడ్డి. అయితే షర్మిల పార్టీ గురించి తనకు తెలియదు అని అంటే అది బుకాయించినట్లు అవుతుందని, షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే విషయం తమకు రెండు మూడు నెలలుగా తెలుసని సజ్జల పేర్కొన్నారు. అయితే తాము షర్మిల పార్టీ ఏర్పాటు చేయడానికి విముఖంగా ఉన్నామని, పార్టీ ఏర్పాటులో ఎదురయ్యే ఇబ్బందుల గురించి తనకు వివరించామని, అయితే ఆమె తన సొంత నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది షర్మిల వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని, వైయస్సార్ మార్గదర్శకత్వంలో నడవాలని షర్మిల కూడా అనుకుంటున్నారని, ఆమె సొంత నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని, అయితే తెలంగాణలో ఆమె ఒకవేళ పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీకి తమ వైఎస్సార్సీపీకి ఎటువంటి సంబంధాలు ఉండే అవకాశం లేదని సజ్జల పేర్కొన్నారు.
షర్మిల తో ఉన్న విభేదాలు కాదు… కేవలం భిన్నాభిప్రాయాలే:
అయితే కొందరు పాత్రికేయులు – కనీసం సలహాలు సూచనలు షర్మిలకు మీరు ఇస్తారా అని ప్రశ్నించగా, అసలు ఆమె పార్టీ ఏర్పాటు చేయడానికే తాము విముఖంగా ఉన్నప్పుడు సలహాలు ఎలా ఇస్తామని, తమ పార్టీ తరఫున ఎటువంటి సలహాలు సూచనలు కానీ సంబంధాలు కాని షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీతో ఉండవని సజ్జన తేల్చేశారు. ఇక అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు కూడా సజ్జల వివరణ ఇచ్చారు. ఇద్దరి మధ్య కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని, అంత మాత్రాన అవి విభేదాలు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. ఇటువంటి భిన్న అభిప్రాయాలు ఏ ఇద్దరి మధ్య అయినా సహజమే అని కూడా ఆయన అన్నారు.
షర్మిల పార్టీకి తన తరఫు నుండి ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని, జగన్ నుండి కూడా బెస్ట్ విషెస్ ఉంటాయని తాను భావిస్తున్నానని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.