మన పురణాల్లో వైరభక్తి అనే కాన్సెప్ట్ వుంటుంది.దేవుణ్ని పూజించేవారికన్నా ద్వేషించే వారే త్వరగా ఆయనను చేరతారు అని. వైకుంఠంలో రుషుల కోపానికి గురైన జయవిజయులనేవాళ్లు మళ్లీ తమ బాస్ విష్ణువును చేరుకోవడానికి ఈ మార్గమే తీసుకుని రావణ కుంభకర్ణ తదితర మూడు జన్మలు ఎత్తుతారు. టిడిపి వైసీపీల మధ్య కూడా రాజకీయంగా ఇలాటి వైరప్రేమ నడుస్తుంటుంది. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం నేతల విమర్శలు మొత్తం జగన్‌పైనే వుండేవి. ఆయన కాంగ్రెస్‌లో వున్నప్పుడు తర్వాత వైసీపీ ఏర్పాటుచేశాక కూడా ఒకే రోజు ఇద్దర ముగ్గురు రకరకాల విమర్శలు చేయడం నాకు తెలుసు. ఇదంతా . జగన్ ఫోబియా అని వైసీపీ ఎదురు దాడి చేసేది. .ఇప్పుడు లోకేష్ పై వైసీపీ వారు అదేపనిగా చర్చ సాగించడం చూస్తుంటే టిడిపి గతంలో చేసిన మేలుకు రుణం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. గతంలో ఆయనపై విడుదల చేసిన ఫోటోలు పెద్దగా పనిచేయలేదు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను అవమానించినట్టు పెట్టిన ఫోటో కూడా పాక్షికంగానే పనిచేసింది. దీంతో ఈ వ్యవహారం ముగించి మరేదైనా పదునైన విమర్శకోసమే ఆధారం కోసమో చూస్తే అదే రకం.కాని ఇప్పటికీ ముగ్గురు నలుగురు నాయకులు లోకేష్‌పైనే కేంద్రీకరించి మాట్లాడటం అవసరమా? గతంలో జగన్ వున్న స్థానంతో లోకేష్‌ను పోల్చలేము కూడా. . నిజంగా ఏదైనా నిర్దిష్ట సమాచారం ఆధారం సేకరిస్తే బహిరంగంగానే సమాధానం కోరవచ్చు. బలహీనమైన ఈ దాడి ద్వారా వైసీపీ తమ ప్రధాన లక్ష్యం లోకేష్ అన్న సంకేతాలు పంపినట్టవుతుంది.
మరోవైపున టిడిపి నేతలు మంత్రులు కూడా రహస్య నల్లధనం వెల్లడి కింద బయిటకు వచ్చిన 10 వేల కోట్టు జగన్‌వేనని ఆరోపించడం కూడా ఇలాటి ఫోబియా కొనసాగింపే. అసలా పథకమే పేర్లు రహస్యంగా వుంచడంపై ఆధారపడింది. టిడిపి కూడా కేంద్ర ప్రభుత్వంలో వుంది. అలాటప్పుడు వారే రాజకీయంగా దీనిపై రభస చేయడం ప్రభుత్వ విధానంపైనే దాడి అవుతుంది. జగన్ కేసులు చూస్తున్న సిబిఐ కేంద్రం అధీనంలోనే వుంది గనక ఏవైనా ఆధారాలు దొరికితే అప్పగించి విచారణ జరిపించవచ్చు. వూరికే మీడియా కోసం హడావుడిచేయడం వృథా ప్రయాసే. జగన్‌పై తమ నిరంతర విమర్శలు ఆయనకు వచ్చిన భారీ ఓటింగును తగ్గించలేకపోయాయనే నిజాన్ని టిడిపి సగం పదవీ కాలం పూర్తయినా జీర్ణించుకోలేకపోతే ఎలా?