వైసీపీ ఇప్పటికీ రాజకీయ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అధికారం చేపట్టిన మొదట్లో చంద్రబాబును కదలనిచ్చేవారు కాదు. కరోనా వచ్చే వరకూ దాదాపుగా పది సార్లు ఆయనను హౌస్ అరెస్ట్.. అరెస్ట్ చేయడమే కాదు.. రెండు సార్లు విశాఖ, తిరుపతి ఎయిర్ పోర్టుల నుంచి వెనక్కి పంపారు. ఎన్నికల వేడి పెరుగుతున్న ఈ సమయంలోనూ రాజకీయ పర్యటనలను పోలీసుల సాయంతో అడ్డుకుని.. వైసీపీ సంతోషపడుతోంది. కానీ దాని వల్ల లాభం జరుగుతుందో.. నష్టం జరుగుతుందో అంచనా వేయడం లేదు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ కౌన్సిలర్ ఇంటిని అక్రమం అంటూ కూల్చివేయించారు. అక్కడ మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు అరాచకానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. ఆయన దెబ్బకు చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనకు వ్యతిరేకకమే.కానీ ఆయన మంత్రి కాబట్టి ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. వ్యతిరేకించేవారిని.. విమర్శలు చేసే వారి ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడమే తాను నేర్చుకున్న విద్య అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై టీడీపీ నేత గౌతు శిరీష గట్టి పోరాటం చేస్తున్నారు.
పలాసలో అధికారులు కూలగొట్టిన టీడీపీ నేత ఇంటిని చూసేందుకు వెళ్తున్న లోకేష్‌ను ఉత్తరాంధ్ర పోలీసులు మొత్తం ఏకమై ఆపేశారు. చివరికి విశాఖలో కూడా ఆయనను మీడియాతో మాట్లాడనివ్వలేదంటే ..లోకేష్‌ను కట్టడి చేయాలని వారు ఎంత తాపత్రయ పడ్డారో అర్థం చేసుకోవచ్చు. పైగా పలాస వచ్చి సవాల్ చేస్తే ఊరుకుంటామా అని సీదిరి అప్పలరాజు చెబుతున్నారు. అందుకే పోలీసులతో ఆపేయించి వెనక్కి పంపామంటున్నారు. మంత్రి తీరు చూసి టీడీపీ నేతలు పైకి ఆగ్రహం చెబుతున్నా.. లోపల మాత్రం.. ముందు ముందు సీన్ అర్థమవుతుందని సెటైర్లు వేసుకుంటున్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పర్యటనలు అడ్డుకుంటే… అది అధికార పార్టీకే నష్టం జరుగుతుంది. ఆ విషయంలో అనేక సార్లు రుజువయింది. ఇప్పటికీ వైసీపీ ఆ అడ్డుకునే వ్యూహం నుంచి బయటకు రావడం లేదు. మమూలుగా లోకేష్ పర్యటన సాగి ఉన్నట్లయితే..ఆయన టీడీపీ నేతను పరామర్శించి.. ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు .. అంతకు మించిన మైలేజీ వచ్చింది. మీడియా..సోషల్ మీడియాలో లోకేష్ హైలెట్ అయ్యారు.