అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మరో పార్టీ విజయం సాధించలేదు. నందమూరి కుటుంబ సభ్యులు అక్కడ్నుంచి పోటీ చేయడం ఓ కారణమో… లేక.. ఇతర పార్టీలకు బలమైన నాయకత్వం లేకపోవడం కారణమో కానీ… టీడీపీ ప్రతీ ఎన్నికలోనూ గెలుస్తూనే వస్తోంది. ఈ సారి నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అక్కడ… నవీన్ నిశ్చల్ అనే అభ్యర్థి పని చేసుకుంటున్నారు. కానీ హఠాత్తుగా బాలకృష్ణను ఎదుర్కోవడానికి ఆయన సరిపోరని అనుకున్నారేమో కానీ… 2009లో టీడీపీ నుంచి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అబ్దుల్ ఘనీని పార్టీలో చేర్చుకున్నారు. టిక్కెట్ ఖరారు చేసిన తర్వాతే ఆయన పార్టీలో చేరారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
2009లో గెలిచిన అబ్ధుల్ ఘనీ పనితీరుపై వ్యతిరేకత ఉండటంతో చంద్రబాబు గత ఎన్నికల్లోనే మార్చాలనుకున్నారు. ఆ సమయంలో బాలకృష్ణ రంగంలోకి రావడంతో.. ఘనీ కూడా.. వ్యతిరేకించలేకపోయారు. టీడీపీ గెలిచిన తర్వాత అబ్దుల్ ఘనీకి చంద్రబాబు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. అయితే.. ఇటీవలి కాలంలో… వైసీపీ నుంచి టిక్కెట్ ఆఫర్ రావడంతో ఆయన వైసీపీ చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు శ్రీకాకుళం పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి కండువా కప్పించుకున్నారు. ఘనీని వైసీపీలోకి తీసుకోవడంపై… హిందూపురంలోని ఆ పార్టీ నేతలే అసంతృప్తికి గురవుతున్నారు. ఇంత కాలం పార్టీని నమ్ముకుని ఉన్న వారికి.. జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు మథన పడుతున్నారు.
నిజానికి నవీన్ నిశ్చల్ ఇటీవలి కాలంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ… హిందూపురంలో అభివృద్ధి పనులు ఎక్కువగా చేపట్టినా.. ఆయన అందుబాటులో ఉండరన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సారి బాలకృష్ణను ఓడించకపోతే గుండు కొట్టించుకుంటానని ప్రకటనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పైగా.. 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్న సానుభూతి ఉంది. 2009లో ఇండిపెండెంట్గా పోటీ చేసి…మరీ రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి గెలుపు ఖాయం అనుకుంటూటే.. ఆయనకు జగన్ హ్యాండిచ్చారు.