నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ దూకుడూ నోటి దురుసే తమకు కలిసి వస్తుందని టిడిపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. రోజా అక్కడ మకాం వేసి రోజూ తిట్టిపోయడం, ముఖ్యంగా మంత్రి అఖిల ప్రియ వస్త్ర ధారణపై దాడి చేయడం మహిళలకు ఎంతమాత్రం నచ్చలేదని కూడా వారు చెబుతున్నారు. నిజంగానే వైసీపీలోనూ కొందరికి హద్దుమీరి మాట్లాడ్డం మంచిది కాదనే భావన వుంది. ఈ పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ పర్యటనకు రావడం వల్ల తమకేమైనా మేలు జరగొచ్చనే ఆశ వారిలో వుంది. వున్న ఫలానా ఏదో ఒకటి హడావుడిగా మాట్లాడే బాలయ్య నోటివెంట ఏమైనా ఆణిముత్యాలు వస్తాయని తమకు ఆయుధాలవుతాయని వారు ఎదురు చూస్తున్నారు. ఒక వేళ ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడినా ఏవైనా చిన్నచిన్న పొరబాట్లు దొర్లకుండా వుండవనీ, వాటికి గతంలోని విమర్శలు కూడా జోడించి మరో దఫా విమర్శలు పెంచుతామని వారంటున్నారు. కృష్ణ మహేష్ బాబు అభిమానులు వైసీపీకే మద్దతిస్తారని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ప్రకటించినా- నేరుగా బాలకృష్ణ రావడం వల్ల ఎంతో కొంత ప్రభావం వుంటుందని కూడా పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీకి అనుకున్న దానికన్నా అధికంగా మద్దతు వున్నా అధికార పక్షాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని చెబుతున్నారు.