వినేందుకు విచిత్రంగా వున్నా ఇదే నిజం. శాసనసభలో ఏకైక ప్రతిపక్షంగా సభ వెలుపల కూడా బలమైన ప్రధాన ప్రతిపక్షంగా వున్న వెఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆశలన్నీ తెలుగుదేశంపైనే పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలన మొత్తం అస్తవ్యస్తంగా నడుస్తుంది గనక ఆ అసంతృప్తి ఫలితాలు తమ పార్టీకి వరప్రసాదాలుగా మారిపోతాయని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. మేం ఏం చేయనవసరం లేదు, చంద్రబాబు తప్పులే మాకు ఓట్ల వర్షం కురిపిస్తాయని వైసీపీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభుత్వంపై అసంతృప్తి మాట నిజమే అయినా అది దానికదే వైసీపీ పట్ల అనుకూలతగా మారిపోతుందా అని ప్రశ్నిస్తే ముమ్మాటికి అంతేనని వారు జవాబిస్తారు. ఈ మధ్య కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే పల్లవి ఎత్తుకున్నారు. ప్రధానంగా వైసీపీ కనిపిస్తున్నది గనక ప్రజలు దానివైపు మొగ్గుతారు అని.
ఇదిఒక విధంగా పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ సూత్రం. అధికారంలో వున్నవారిపట్ల ఆగ్రహం లేదా అనుకూలత అనేదాన్ని బట్టి మాత్రమే ఎన్నికల ఫలితాలు వుంటాయని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. మరి మీ ప్రజా ప్రస్థానం వంటివి ప్రభావం చూపించలేదా అని నేను ఒకసారి అడిగాను. అవన్నీ సెకండరీ. యాంటీ గవర్నమెంటు ఫీలింగ్ అన్నిటికన్నా ముఖ్యం అని ఆయన వివరించారు. వానలు బాగా పడితే కొంత అదనపు అనుకూలత వుంటుందని కాని చంద్రబాబు హయాంలో వానలు కూడా మొండికేయడంతో వ్యతిరేకత పెరిగి తాము గెలిచామని ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ కూడా ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. టిడిపికి ప్రజలు దూరమై పోయారని, రెండో స్థానంలో వున్నది తామే గనక తమవైపే వస్తారని ఆ పార్టీ నేతలు పూర్తిగా నమ్ముతున్నారు. కాకపోతే ఒకటే సమస్య- యుపిలో మాయావతి, ఢిల్లీలో కేజ్రీవాల్ వంటివారు హఠాత్తుగా ముందుకొచ్చిన ఉదాహరణలు కూడా మర్చిపోకూడదు.పైగా అసంతృప్తి వుండటం వేరు అది ఇప్పటికిప్పుడే తిరస్కరించే స్థాయికి చేరడం వేరు. వైసీపీ కూడా క్రియాశీలంగా వుందా లేదా అని ప్రజలు గమనిస్తూనే వుంటారు.తప్ప పండిన కాయ వళ్లో వాలినట్టు అధికారం వచ్చిపడుతుందని కాదు.