ప్రజలు 151 సీట్లు ఇస్తే అది చాలదని ఇతర పార్టీల నుంచి ఐదుగుర్ని చేర్చుకున్నది కాకుండా వారి సాయంతోనే మరో ఎమ్మెల్సీ గెల్చుకుందామని ప్రయత్నం చేస్తూ.. తీవ్ర ఒత్తిడికి గురవుతోంది వైసీపీ పార్టీ. ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యేలకు రాచ మర్యాదలు చేస్తున్నారు. విజయవాడ స్టార్ హోటళ్లలో క్యాంపులు పెట్టి విందు వినోదాలు ఏర్పాటు చేయడమే కాదు వారి కోరికల్ని తీరుస్తున్నారు. పెండింగ్ నిధులు ఏమైనా ఉంటే వెంటనే విడుదల చేయిస్తున్నాయి. కాంట్రాక్టర్లు అయిన ఎమ్మెల్యేలు… తన అనుచరులతో పనులు చేయించిన వారికి.. బిల్లులు మంజూరు చేయడం లేదనే అసంతృప్తిని బహరంగంగా వెళ్లగక్కిన గంటలో నిధులు వారి ఖాతాలో జమ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సీఎం జగన్ ఇప్పటి వరకూ కనీసం వంద మంది ఎమ్మెల్యేలకు కూడా నేరుగా అపాయింట్ మెంట్లు ఇవ్వలేదు. ముఖాముఖి కలవలేదు. ఇప్పుడు మాత్రం సమయం చూసుకుని అసంతృప్తిగా ఉన్నారని అనుమానం వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. తీయగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకూ ఈ గౌరవం లభిస్తుందని వారికి కూడా తెలుసు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోవాలంటే ఇంత టెన్షన్ పడాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకన్న వాదన సహజంగానే ఆ పార్టీలో వినిపిస్తోంది. అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే విధానాన్ని ఆ పార్టీ హైకమాండ్ ఎప్పుడో అడాప్ట్ చేసుకుందని ఇందులో కొత్తేముందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
మొత్తంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వైసీపీ హైకమాండ్ అనుమానపడుతోంది. వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. హోటళ్లలో వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. వారు కూడా తాము వైసీపీ అభ్యర్థులకే ఓటు వేస్తామని చెబుతున్నారు. కానీ నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం ఫిరాయింపుదార్లతో కలిసి వైసీపీకి 154 మంది ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీకి 22 ఓట్లు కావాలి. టీడీపీకి అధికారికంగా 23 మంది ఉన్నారు. కానీ నలుగురు వైసీపీకి ఓటేస్తారు. వైసీపీ నుంచి ఇద్దరు టీడీపీకి ఓటేస్తారు. అప్పుడు టీడీపీకి ఒక్క ఓటు అవసరం అవుతుంది. కానీ టీడీపీకి ఇరవై ఐదు ఓట్లు వస్తాయన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. రహస్య ఓటింగ్ పద్దతిలో పోలింగ్ జరగనుంది కాబట్టి ఎవరు ఎవరికి ఓటేశారు.. ఎవరి ఓటు చెల్లలేదు అన్నది రుజువులు ప్రకారం తెలియదు. కానీ గుర్తించడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైనా ధిక్కరిస్తే వెంటనే తెలిసిపోతుంది.
నీతి నిజాయితీ రాజకీయాలకు పెట్టింది పేరు తమ పార్టీ అని వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో ఇంటా బయటా డప్పు కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫిరాయింపుదార్లపైనే ఆశలు పెట్టుకుని తమకు లేని సీటు కోసం పోటీ పెట్టారు. ఇప్పుడు పరువు పోతుందేమో అని కంగారు పడుతున్నారు.