రఘురామకృష్ణరాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని కంగారు పడుతున్న వైసీపీ ఆ బాధ్యతను రాజమండ్రి ఎంపీ భరత్‌కు ఇచ్చింది. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎం చెప్పాలో చెప్పి పంపుతున్నప్పటికీ.. ఆయన వాదనలు రాజకీయవర్గాలకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎవరైనా బీజేపీ ఎంపీ మోదీని తిడుతూంటే ఊరుకుంటారా.. అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ కారణంగానైనా అనర్హతా వేటు వేయాలని అడుగుతున్నారు.
కానీ అనర్హతా చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఓ పార్టీ గుర్తుపై ఎన్నికైన వారు మరో పార్టీలో చేరితే అనర్హతా వేటు వేస్తారు. సొంత పార్టీని ధిక్కరించడం.. పార్టీ అధినేతను విమర్శించడం… ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనర్హతా వేటు కిందకు రాదు. రఘురామకృష్ణరాజు వైసీపీలోనే ఉన్నారు. ఆయన ఏ ఇతర పార్టీలో చేరలేదు. అయినా అనర్హతా వేటు వేయించాలని ప్రయత్నిస్తున్నారు. సాంకేతికంగానే కాదు.. రాజకీయంగా చూసినా రఘురామకృష్ణరాజు అనర్హతపై వైసీపీ ప్రయత్నాలు తేలిపోయాయన్న వాదన వినిపిస్తోంది.
వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నట్లుగా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ అడ్డగోలుగా వైసీపీ జెండాలు వేసుకుని జనంలోకి వెళ్లడం లేదు. అయినా .. ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నది సంసారం కానీ రఘురామ చేస్తున్నది మాత్రం కాదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాల వల్ల వైసీపీ అంటేనే ఓ రకమైన తేలిక భావం సాధారణ ప్రజల్లోనే కాదు.. ఉన్నత స్థాయిలోనూ ఏర్పడుతోంది.