జగన్ పై రాయి దాడి అనగానే వైసీపీ రంగంలోకి దిగిపోయింది. తమ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లేనని యాక్షన్ ప్రారంభించింది. అసలేం జరిగిందో తెలిసీతెలియక ముందు… ” చంద్రబాబు ” అంటూ బిగ్గరగా కేకలు వేసుకుంటూ… పెద్దనోరున్న అంబటి లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చేశారు. అంతా ప్లాన్డ్ గా జరిగిందని అందరూ అనుకుంటున్న సమయంలో వైసీపీ నేతలు మరింత పకడ్బందీగా .. స్క్రిప్ట్ ప్రకారం అన్నట్లుగా రాజకీయాలు ప్రారంభించారు.
జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్పందన లేదన్నది అందరికీ తెలిసిన నిజం. ఆయనకు ఉండే సెక్యూరిటీ.. ఆ నియోజకవర్గంలో పోటీ చేసేఅభ్యర్థి అతి కష్టం మీద తీసుకు వచ్చే ఒకటి,రెండు వందల మంది తప్ప సామాన్య జనం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో బస్సు యాత్రను ఆపలేక.. కొనసాగించలేక తంటాలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. అందుకే గులకరాయి ఎపిసోడ్ బయటకు వచ్చినట్లుగా అనుమానాలు వస్తున్నాయి.
జగన్ పై రాయి దూసుకు వస్తే.. దానికి చంద్రబాబే కారణం అని ఆరోపించి.. సానుభూతి రాజకీయాలు ప్రారంభించగానే అసలేం జరిగిపోయిందో అందరికీ తెలిసిపోతుంది. సొంత పార్టీ కార్యకర్తలు కూడా సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ అయితే బోర్ కొడుతుంది కదా అన్న భావనకు వస్తున్నారు. అయితే ఇంతకు మించిన ఆలోచన … అనుభవం ఉన్న ఘటనలు తమకు చేతకావనుకున్నారేమో రంగంలోకి దిగిపోయారు.
రాయితో తగిలింది అతి చిన్న గాయం. చిన్న బ్యాండేజ్ వేసుకున్నారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి డ్రెస్ వేసుకుని వైద్య పరీక్షలు చేసుకుని ఫోటోలు తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. ఎందుకిదంతా ? ఓ వైపు లేని జనస్పందన.. మరో వైపు షర్మిల, సునీత వేస్తున్న ప్రశ్న… ఎన్నికల బరిలో వెనుకబడిన అన్నింటికీ… పరిష్కారాన్ని గులకరాయితో వెదుక్కున్నారు.