2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జాతీయ సర్వేలు వచ్చాయి. ఆ సర్వేలన్నింటిలో.. వైసీపీ భారీ విజయం సాధించబోతోందని అంచనా వేశాయి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవన్నీ పెయిడ్ సర్వేలని కొట్టి పారేశారు. తాము లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించామని .. మంచి సంక్షేమాన్ని ఇచ్చామని.. రాష్ట్రానికి ఓ దశ, దిశ తీసుకొచ్చామని అనుకున్నారు. రాజధాని, పోలవరం , కరెంట్ విషయాల్లో ప్రజల్ని మెప్పించామనుకున్నారు.
తమకు తెలిసిన లోకల్ , పెయిడ్ సర్వేలను విడుదల చేయించుకుని ఎదురుదాడి చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత తాము ఎంత మాయా ప్రపంచంలో ఉన్నామో వారికి అర్థమైంది. నిజానికి టీడీపీ ఓటమిపై చాలా మందికి ముందే క్లారిటీ ఉంది. తాము పాలన, సంక్షేమం, అభివృద్ధి దారిలో వెళ్తే.. వైసీపీ కులం దారిలో వచ్చిందన్న సంగతిని గుర్తించే సరికి చాలా ఆలస్యమైపోయింది. కుల ద్వేషం రెచ్చగొట్టి అనూహ్యమైన ఫలితాలను వైసీపీ సాధించింది.
ఇప్పుడు వైసీపీది అదే పరిస్థితి. తాము అకౌంట్లలో డబ్బులేశామని.. అందరూ ఓట్లేస్తారని ఆశ పడుతున్నారు. జాతీయసర్వేలు తప్పు అని అంటున్నారు. నిజానికి సర్వేలను కొనే ప్రయత్నం చేసింది వైసీపీనే, ఈటీజీ పేరుతో తాడేపల్లి కంపెనీని పెట్టి.. టైమ్స్ నౌలో సర్వేలు వేసుకుంటున్నారు. సీఓటర్ సర్వేను ప్రభావితం చేయడానికి ఇండియాటుడే కు ఐదు కోట్లుతో ఓ ప్రోగ్రాం కూడా చేశారు. అయినా సర్వేలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలను కొనలేమని ప్రజాభిప్రాయాన్ని చెబుతాయని వారికీ తెలుసు.
అయితే సర్వేలను అంగీకరిస్తే ముందే అభ్యర్థులు చేతులెత్తేస్తారు. అది మరింత ఘోరమైన ఓటమికి దారి తీస్తుంది. మేకపోతు గాంభీర్యంతో ఎన్నికల పోరు చేస్తున్నారు. కానీ వైసీపీలో రాను రాను ఆ గాంభీర్యం కూడా తగ్గిపోతోంది. ఎక్కువ మంది అభ్యర్థులు ముందే చేతులెత్తేస్తున్నారు.