ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ… ప్రతిపక్ష పార్టీ దగ్గరున్న ప్రచాస్త్రాలు ఒక్కోటిగా తుస్సుమనే పరిస్థితికి వస్తున్నాయి. నవరత్నాలే తమకు అధికారం తెచ్చిపెడతాయని పాదయాత్రలో గొప్పగా ప్రచారం చేసుకున్న విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ఇంటింటికీ నవరత్నాలు తీసుకెళ్లాలంటూ ఆ మధ్య ఓ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో పార్టీ నాయకులు కూడా నవరత్నాల ప్రచారం గురించి ఆలోచించడం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలే వైకాపాకి ప్రచారాస్త్రాలు లేకుండా చేశాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజల సమస్యలను అధికార సాధన మార్గాలుగా వైకాపా చూస్తే…. అవే సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతోంది టీడీపీ. గడచిన రెండు రోజులుగా, వైకాపాకు ప్రచారాస్త్రాలను వెతికిపెట్టే పనిలో పడింది సాక్షి.
ఇవాళ్టి పత్రికలో ‘శాంతి లేదు.. భద్రత కానరాదు’ అంటూ రాష్ట్రమంతా తీవ్రమైన శాంతిభద్రతల సమస్య ఉన్నట్టు రాసుకొచ్చారు. ఆ కథనంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు చూస్తే… అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజా బహిష్కరణ, 2017లో విశాఖ విమానాశ్రయంలో జగన్ నిర్బంధించడం, గత ఏడాది జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, మూడేళ్ల కిందటి లెక్కలు పట్టుకొచ్చి… రైల్వే నేరాల్లో, మహిళలను అగౌరవ పరచడంలో ఆంధ్రా టాప్ అంటూ రాసుకొచ్చారు. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఎలాంటిదో ప్రజలకు తెలిసిందే. కాబట్టి, వేటుకు గురయ్యారు. ఇక, 2017 ఫిబ్రవరిలో విశాఖ విమానాశ్రయంలో జగన్ ను పోలీసులు అడ్డుకున్నది ఎందుకు… అప్పటికే విశాఖలో పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా శాంతి ర్యాలీ తలపెట్టారు. స్వచ్ఛందంగా యువత చేస్తున్న కార్యక్రమం అది. దాన్లో రాజకీయ పార్టీల జోక్యం జరిగితే.. శాంతిభద్రతల సమస్యకు ఆస్కారం ఉంటుందని పోలీసులు ఆయన్ని ఆపారు. ఇక, కోడి కత్తి కేసు తెలిసిందే..! విచారణకు ఏపీ పోలీసులు జగన్ కి పనికిరారు, కానీ ఆయన పాదయాత్ర చేస్తే మాత్రం… ఆంధ్రా పోలీసులే భద్రత ఇవ్వాలి. ఈ దాడికి పాల్పడింది వైకాపా అభిమానే అని ఓ పక్క స్పష్టంగా ఉన్నా కూడా… దాన్ని అధికార పార్టీ చర్యగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు.
వీటితోపాటు మరికొన్ని ఘటనల్ని ఉదహరించారు. కానీ, ఆయా ఘటనల తరువాత ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల గురించి మాత్రం సాక్షి ప్రస్థావించలేదు. కొన్ని ఘటనలు ఏరుకొచ్చి… వాటిని బూచిగా చూపించి, రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు అంటూ తీర్మానించేస్తే… నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సాక్షి భావిస్తున్నట్టుంది. ఏదేమైనా, వైకాపాకి ఇప్పటికిప్పుడు ఎన్నికల ప్రచారాంశాలు కావాలి. కాబట్టి, ఏదో ఒకటి తవ్వుకొచ్చి… ప్రజల మీద డంప్ చేసేసి, ప్రభుత్వంపై విమర్శలు చేసేయాలనే ఆతృత పత్రికతోపాటు పార్టీ వర్గాల్లో కూడా బాగానే కనిపిస్తోంది. గడచిన రెండ్రోజులు సాక్షి పత్రికల్ని ఒక్కసారి తిరగేసి చూసినా… ఈ ప్రచారాస్త్రాల కోసం పాకులాటే కనిపిస్తుంది.