వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ స్టాండ్ క్లియర్‌గా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీని డిఫెండ్ చేసి ఎలాగైనా సీబీఐపై, టీడీపీ నిందలేయడమే పనిగా పెట్టుకుంది. సీబీఐ అధికారులు ఒక్కో ఆధారాన్ని విడుదల చేస్తున్నారు. అవినాష్ రెడ్డి కుటుంబం అత్యంత దారుణంగా వివేకానందరెడ్డిని హత్య చేసిందనే అంశంపై ఒక్కో విషయం బయటకు వస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఏ మాత్రం సంకోచించకుండా.. ప్రజలు తమ వాదనే నమ్ముతారన్నట్లుగా వితండ వాదానికి దిగుతోంది. హంతకులను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వాదనకు దిగుతూ ప్రజల్లో తమ పార్టీపై మరో రకమైన అభిప్రాయాన్ని కల్పించే దిశగా వెళ్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి స్వయంగా సీఎం జగన్ బాబాయ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు. ఆయనను చంపేస్తే సీఎం జగన్ .. హంతకులకు మద్దతుగా నిలుస్తున్నారు అంటే.. అది ప్రజల్లో రకకాల విశ్లేషణలకు కారణం అవుతోంది. ప్రతిపక్ష పార్టీలు అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తే జగన్ పాత్ర బయటకు వస్తుందని అందుకే ఆయనను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు ప్రారంభించారు కూడా. ఇది వైసీపీకి ఇబ్బందికరమే. నిందితులను అడ్డగోలుగా వెనకేసుకు రావడమే కాదు .. వారి కోసం దర్యాప్తు సంస్థపై నిందలు వేయడం… అధికారాన్ని అడ్డం పెట్టి సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేయడం కూడా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
వైసీపీ అనుబంధ పత్రికలో వస్తున్న కథనాలు కూడా ప్రజల్ని గందరగోళంలో పడేస్తున్నాయి. గతంలో చేసిన ప్రచారానికి.. ఇప్పుడు జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది. ప్రతీ దానికి చంద్రబాబుతో లింక్ పెట్టడం కూడా కామన్ అయిపోయింది. సీబీఐ అధికారుల్ని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని చెప్పడంతోనే విషయాన్ని రాజకీయం చేసి హంతకుల్ని కాపాడాలనే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారన్న అభిప్రాయం కల్పించేలా చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏదైనా ఉంటే అది వివేకా హత్య కేసే.. ఆ విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరే. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోకపోతే పబ్లిక్‌లో జరిగే ఇమేజ్ డ్యామేజ్ అంతా ఇంతా కాదు.