ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒక్క బొత్స మాత్రమే నాలుగైదు రోజులకు ఓ సారి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడో..తిడున్నాడో తెలియకుండా మాట్లాడి వెళ్లిపోతున్నారు. మిగిలిన వారు కుదిరితే రాజీనామా లేకపోతే సైలెంట్ అన్న ఫార్ములాకు కట్టుబడిపోయారు. ఉత్తరాంధ్రలో ఏ నియోజకవర్గంలో చూసినా కూటమి అభ్యర్థులకు యాభై వేలకుపైగా మెజార్టీ వచ్చింది. పవన్, టీడీపీ కలిస్తే ఎలా ఉంటుందో వారికి అర్థమయింది. జగన్ చేసిన నిర్వాకాలతో ఇప్పుడల్లా ఆయనకు సానుభూతి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదని నిర్ణయానికి వచ్చారు.
తాజాగా అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ధర్మాన దగ్గర నుంచి సీనియర్ నేతలంతా సైలెంట్ అయిపోయారు. వారు పార్టీలోనే ఉంటున్నారు..కానీ చడీ చప్పుడూ అయితే లేదు. వైసీపీలోనే ఉంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. వేరే పార్టీలలోకి వెళ్లిపోవడానికి ఉన్న పార్టీ నుంచే రాజకీయం చేసుకుంటున్నారు. పార్టీతో పట్టనట్లుగా ఉంటున్న వారు, బయటకు వెళ్తే స్పష్టత వస్తుంది. కానీ అలా చేయడంలేదు. వైసీపీ నేతలుగా ఉంటూనే రాజకీయ రాయబేరాలు చేసుకుంటు న్నారని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలోని పార్టీ నాయకులకు కబురు పంపుతోంది. పార్టీలో ఉంటే పదవులు ఇస్తామని, మళ్లీ చురుకుగా పనిచేయాలని కోరుతోంది. కానీ ఎవరూ స్పందించడంలేదు. మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా చోట్ల సరైన నేతలు లేరు. సీనియర్లు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ కూడా తమదైన నిర్ణయాలు ప్రకటించాలని చూస్తోంది. కానీ వారు మంచి ఫ్లాట్ ఫాం దొరికేదాకా కదిలేలా లేరు.