వైసీపీని నిలువుగా ముంచారని పార్టీ నేతలు, క్యాడర్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వారికే జగన్ బాధ్యతలు ఇచ్చారు. పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిధున్ రెడ్డి గత ఎన్నికల్లో బాధ్యతలు తీసుకున్న జిల్లాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. పెద్దిరెడ్డి చంద్రబాబు, బాలకృష్ణలను ఓడిస్తానని సవాల్ చేసి.. చిత్తూరు, అనంతపురం జిల్లాల ఇంచార్జిగా వ్యవహరించారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు తప్ప ఆ రెండు జిల్లాల్లో వైసీపీ తప్ప ఇంకెవరూ గెలవలేదు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రెండు గోదావరి జిల్లాలకు ఇంచార్జిగా వ్యవహరించి నాకించేశారు. ఇప్పుడు జిల్లాలను మార్చినా తండ్రీ కొడుకుల్ని మాత్రం జగన్ వదల్లేదు.
ఉత్తరాంధ్రలో పార్టీ సర్వనాశనానికి కారణం విజయసాయిరెడ్డి అని అందరూ చెప్పుకుంటారు. వైసీపీ నేతలెవరూ ఆయనకు అక్కడ మద్దతుగా లేరు. అయినా ఉత్తరాంధ్రకే విజయసాయిరెడ్డిని పంపారు. నిజానికి సాయన్న ముసలాడైపోయాడు.. అని ఆయనకు రిటైర్మెంట్ గతంలోనే జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆయననే తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. పారటీ క్యాడర్ బాధల్ని ఆయన పట్టించుకోవడం లేదు. ఇక ఆళ్ల అయోధ్యరామిరెడ్డి డబ్బు పంపిణీ మాస్టర్. ఆయన కూడా పార్టీని భ్రష్టుపట్టించారని చెప్పుకుంటారు. ఆయననూ వదల్లేదు.
జగన్ రెడ్డి ఇంచార్జులుగా పెట్టిన వాళ్లంతా గతంలోనూ ఉన్న వాళ్లే. అందరూ ఆర్థిక వ్యవహారాల్లో మాస్టర్లే అన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి డబ్బుతో రాజకీయం చేయడానికే అందరినీ రెడ్లనే నియమిస్తారా అన్న ఆరోపణలు వస్తున్నా పట్టించుకోకుండా వారికే చాన్సిచ్చారని అంటున్నారు. అయితే పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, అయోధ్య రెడ్డి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతారా అన్నదే సందేహం.