స్థానిక సంస్థల్లో అధికారాన్ని అక్రమ పద్దుతుల్లో అందుకున్న వైసీపీకి వాటిని నిలబెట్టుకోవడం చాలా సమస్యగా మారుతోంది. అధికారం పోగానే అందరూ పోలోమంటూ వేరే పార్టీల్లో చేరిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఊహించి ఒక్క సారి ఎన్నిక అయితే నాలుగేళ్ల వరకూ అవిశ్వాసం పెట్టకూడదని నిబంధన తెచ్చారు. ఇప్పుడు ఆ నాలుగేళ్ల సమయం పూర్తి అయింది. ఇప్పుడు దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అవిశ్వాసాలకు రెడీ అవుతున్నారు.
ఏకగ్రీవాలతో స్థానిక ఎన్నికలను అపహాస్యం చేసిన వైసీపీ
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ప్రజలు ఓట్లు వేయాలి. కాని వైసీపీ మాత్రం స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేమన్న ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పోటీ చేసే వారిని కేసుల్లో ఇరికించేలా చట్టాలు తీసుకు వచ్చింది. తమ వారు చేస్తే పోలీసులు పట్టించుకోరని అదే ఎదుటివారు చేస్తే వారిపై అనర్హతా వేటు వేయవచ్చన్న వ్యూహంతో చట్టాలు చేశారు. ఎలాగైనా తాడిపత్రి, దర్శి మున్సిపాలిటీల్లో తప్ప అన్ని చోట్లా గెలిచారు. ప్రజలంతా తమ వైపే ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని వారు అపహాస్యం చేసిన వైనం ఎంత దెబ్బకొట్టిందో ఎన్నికల్లో తెలిసిపోయింది.
ఇప్పుడా మున్సిపాలిటీలను నిలబెట్టుకోవడం గగనం
అధికారం పోగానే.. తమకు వచ్చిన పదవుల ఎక్కడ పోతాయనో.. పార్టీకి ఇక భవిష్యత్ లేదనో కానీ పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ ఇతర పార్టీల్లో చేరిపోయింది. కూటమి పార్టీల్లో వైసీపీ స్థానిక సంస్థల క్యాడర్ చేరిపోవడంతో అనేక చోట్ల మెజార్టీలు కోల్పోయారు. గుంటూరు, విశాఖ వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీకి ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. మేయర్లు కూడా రాజీనామా చేస్తున్నారు. మున్సిపాలిటీల్లోనే ఇదే పరిస్థితి. నాలుగైదు మున్సిపాలిటీల్లో తప్ప అన్ని చోట్ల.. అవిశ్వాసాలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్యాడర్ను నిలుపుకునే యంత్రాంగం లేని వైసీపీ
పార్టీ నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే వారి సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కరింగలిగేది అయితే పరిష్కరించాలి కానీ.. జగన్ .. వైసీపీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కడపలో మాత్రం పరువు పోతుందని వైసీపీ జడ్పీటీసీలను పిలిపించుకుని జగన్ మాట్లాడారు. వారికి కావాల్సిన సౌకర్యాలు చూసే ఏర్పాట్లు చేశారు. ఇతర చోట్ల పోయేవారిని బుజ్జగించే వ్యవస్థ లేదు. మాజీ మంత్రులు..ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోవడం లేదు. వెళ్తే వెళ్లండి అన్నట్లుగా ఉన్నారు. అందుకే ఏకగ్రీవంగా గెల్చుకున్న మున్సిపాలిటీలు .. ఇప్పుడు కూటమి వైపు మారబోతున్నాయి.