వైసీపీలో అంతర్గత సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలపై మీడియాలో హైలెట్ అయ్యేలా బూతులు తిట్టేవారు.. దాడులు చేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని మిగతా నేతలంతా పనికి మాలిన వాళ్లు అన్నట్లుగా చూస్తున్నారన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. భవిష్యత్ భయాలను దృష్టిలో పెట్టుకుని … రాజకీయాల్లో ఇలాంటివి మంచిది కావనుకున్న వారు సైడ్ అయిపోతున్నారు. అవకపోతే హైకమాండ్ సైడ్ చేస్తోంది. ఇప్పుడు అతి కొద్ది మంది మాత్రమే వైసీపీ పార్టీ బాధ్యతల్లో యాక్టివ్ గా ఉన్నారు. మిగతా వారంతా సైలెంట్ అయిపోయారు.
మంత్రి పదవుల్నించి తీసేసిన వారికి జిల్లా అధ్యక్ష పదవులు, రీజినల్ కోఆర్డినేటర్ పదవులు ఇచ్చారు. కానీ వారిలో ఎవరూ యాక్టివ్ గా లేరు. అందరూ పదవుల్ని భారంగా భావిస్తున్నారు. కొడాలి నాని, అనిల్ కుమార్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారు ఇప్పటికే వదిలేసుకున్నారు. సుచరిత లాంటి వాళ్లు కూడా దండం పెట్టేశారు. ఇప్పుడు బాలినేని వంతు. ఇంకా బయటపడలేని వారు చాలా మంది ఉన్నారని అంటున్నారు.
సాధారణంగా వైసీపీ ఒక్కటే. కానీ అందులో జగన్ ను మెప్పించే వర్గం ఒకటి ఉంటుంది. ఇతరుల్ని జగన్ పట్టించుకోరు. ఆయన వర్గం ఎవరంటే.. టీడీపీ నేతల్ని.. వారి సన్నిహితుల్ని బూతులు తిట్టేవారు. వారినే జగన్ ప్రోత్సహిస్తారు. నిజంగా పార్టీ బలోపేతం కోసం పని చేసవారిని ఆయన పట్టించుకోరు. ఇలా అందర్నీ బూతులు తిట్టే ఆ నేతలు జిల్లాల్లో పెత్తనం ఎక్కువ చేసేస్తున్నారు. దీంతో వైసీపీలో వర్గాలకు వర్గాలు తయారవుతున్నాయి. చివరికి పార్టీ కోసం ఎంత కష్టపడినా తమను పట్టించుకోవడం లేదని మెజార్టీ వైసీపీ క్యాడర్ అనుకునే పరిస్థితి వచ్చింది.
పార్టీ పని అంటే బానిసత్వంగా మారిందన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. ఇప్పటికే పార్టీ పరంగా గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల సమావేశాలు, స్థానిక సమస్యలు-నిధుల వేట, మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ, జగనన్నే మా భవిష్యత్ వంటివి ఒకదాని తర్వాత మీద పడేస్తున్నారు. అసలు ఆర్థికంగా ఏ ప్రయోజనం కలగకపోగా.. ఈ చాకిరీ ఏమిటని ఎక్కువ మంది లైట్ తీసుకుంటున్నారు.