గన్నవరం వైసీపీలో ఆ పార్టీలో ఉన్న మూడు గ్రూపుల మధ్య రగడ దాడులు చేస్తాం… పేల్చేస్తాం… అంతు చూస్తాం అన్న వరకూ వస్తున్నాయి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో పెత్తనం చేస్తున్న వల్లభనేని వంశీపై ఆయనపై పోటీ ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు, నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న దుట్టా రామచంద్రరావు విరుచుకుపడుతున్నారు. ఆయన అల్లుడు.. వైఎస్ భారతి బంధువు శివభరత్ రెడ్డి మరింత దూకుడుగా వెళ్తున్నారు. వంశీపై విమర్శలు చేస్తున్నారు. సీమలో పాలేరు పని చేసుకున్నారని వంశీని అంటున్నారు. వంశీ కూడా మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ట్రాన్స్ఫార్మర్లా పేలిపోతావని హెచ్చరిస్తున్నారు. వంశీకి వ్యతిరేకంగా ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా తెరపైకి వచ్చారు. గత ఎన్నికల్లో వెయ్యి లోపు ఓట్లతో బయటపడిన వంశీకి ఇప్పుడు.. వైసీపీలోకి వెళ్లడంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
వంశీని దారుణంగా కించ పరుస్తున్నా.. వైసీపీ హైకమాండ్ శివభరత్ రెడ్డినికానీ.. దుట్టా రామచంద్రరావుని కానీ.. యార్లగడ్డ వెంకట్రావును కానీ వారించడం లేదు. దీంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో దుట్టా రామచంద్రరావు, శివభరత్ రెడ్డిలను పిలిచి వంశీపై కంప్లైంట్లు తీసుకున్నారు. కానీ వంశీని పిలిచి పెద్దగా మాట్లాడకుండానే పంపేశారు. అయితే దుట్టాను మీడియా ముందు మాట్లాడవద్దని మాత్రం చెప్పలేదు. ఇదే తమకు హైకమాండ్ ఇచ్చిన చాయిస్ అని వారు చెలరేగిపోతున్నారు. దీంతో వంశీ కూడా వారికి కౌంటర్ ఇస్తున్నారు.
మరో వైపు అమెరికాకు వెళ్లిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ తిరిగి వచ్చారు. ఈ సారి కూడా టిక్కెట్ తనదేనంటున్నారు. తాను గతంలో పెద్ద ఎత్తున ఖర్చుపెట్టుకున్నానని పార్టీకి ఏమీ లేనప్పుడు కార్యకర్తల్ని చూసుకున్నానని ఇప్పుడు తనకు చాన్సివ్వాల్సిందేనని ఆయన అంటున్నారు. ఆయన కూడా వంశీని విలన్గా చూపిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయనకూ వంశీ కౌంటర్ ఇస్తున్నారు. వీరిపై వంశీ టీడీపీ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు టీడీపీ నుంచి వచ్చింది నువ్వే కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. తీరు చూస్తూంటే.. దుట్టా వర్గాన్ని.. యార్లగడ్డ వర్గాన్ని హైకమాండే ప్రోత్సహిస్తోందని.. వంశీని వదిలించుకోవాలన్న ఆలోచనలో ఉందని విశ్లేషిస్తున్నారు.