అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లూరు వరకూ కోస్తా ప్రాంతం కిందకు వచ్చినా చిత్తూరు మాత్రం రాయలసీమ కిందకు వస్తుంది. అక్కడా రైతులకు అనూహ్యైన స్వాగతం లభిస్తోంది. అధికార బలాన్ని ఉపయోగించుకుని వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇతర నేతలు రైతులకు సాయం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ సహకరించడానికి చాలా మంది ముందుకువస్తున్నారు. దీంతో సహజంగానే రాజధాని రైతులకు సీమ ప్రజల మద్దతు ఉందన్న అభిప్రాయం బలంగా వినిపించడం ప్రారంభమయింది.
అయితే ఇలాంటి ప్రజల మద్దతు ఉంటే తమకు కష్టమని భావించే కొంత మంది స్వయం ప్రకటిత వైసీపీ మేధావులు రంగంలోకి దిగారు. అమరావతిలో రాజధాని వల్ల రాయలసీమకు నష్టం అని.. అయితే రాయలసీమలో రాజధాని ఉండాలి లేకపోతే విశాఖలోనే ఉండాలన్న కొత్త వాదన తీసుకు వచ్చారు. విశాఖలో రాజధాని ఉంటే రాయలసీమ వాసులకూ అన్ని విధాలుగా నష్టం అనేది పదో తరగతి చదివే పిల్లలకైనా అర్థం అవుతుంది.కానీ ఈ మేధావులు మాత్రం భిన్నమైన వాదన వినిపించడం ప్రారంభించారు. టీడీపీ తన విధానాన్ని మార్చుకోవాలని రాజకీయ కామెంట్లు కూడా ప్రారంభించారు.
టీడీపీ అధికారపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది లక్ష్మణరెడ్డి, పురుషోత్తంరెడ్డి ఇలా అనేక మంది రెడ్లు వివిధ రకాల “సీమ” కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని రెచ్చగొట్టారు. అప్పటి ప్రభుత్వం అక్కడి ప్రజల బతుకుల్ని మార్చేలా చేసిన ఇరిగేషన్ పనులు.. తీసుకొచ్చిన పరిశ్రమలతో బతుకులు మారవని.. కేవలం మన కులపోడు వస్తేనే బాగుపడతామన్నట్లుగా ప్రచారం చేశారు. నిజంగానే ఇప్పుడు వారంతా బాగుపడ్డారు. పదవులు అనుభవిస్తున్నారు. కానీ ప్రజల పరిస్థితి మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇప్పుడు రాజధాని రైతులపాదయాత్ర తిరుపతికి చేరే సరికి ఆ స్వయం ప్రకటిత మేధావుల శిష్యులు రంగంలోకి బాధ్యతలు తీసుకున్నారు. వారికి అధికార పార్టీ మీడియా సహజంగానే అందుబాటులో ఉంటుంది. ఈ అంశంపై ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి రెడీగా ఉన్నారు. అయితే పరిస్థితులు గతంలోలా లేవని.. కులం, ప్రాంతం పేరుతో చేస్తున్న రాజకీయంపై యువత ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటున్నారన్న అభిప్రాయం సోషల్ మీడియాలోనూ వినిపిస్తోంది. అయితే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయం చేసేవారు తమ రాజకీయం మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు.